ఈ–సిగరెట్స్‌పై తొలి కేసు

23 Sep, 2019 08:45 IST|Sakshi

గత వారం వీటిని నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

రంగంలోకి దిగిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌

విక్రేత అరెస్ట్, 35 సిగరెట్లు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు వాడకం, దిగుమతి, అమ్మకం తదితరాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం గత వారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. వీటిని వినియోగిస్తున్న వారిలో 70 శాతం యువతే ఉండటం, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని తక్షణం అమలులోకి తీసుకువస్తూ నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా, దాడులు ముమ్మరం చేశారు. ఫలితంగా మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తొలి ఈ–సిగరెట్స్‌ కేసును పట్టుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం అతడిని అబిడ్స్‌ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. దీంతో ఈ–సిగరెట్స్‌పై తొలి కేసు నమోదు చేసిన ఠాణాగా అబిడ్స్‌ రికార్డులకు ఎక్కనుంది.

పాతబస్తీలోని శాలిబండ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ నూర్‌ ఆరిఫ్‌ అలీ ఎంజే మార్కెట్‌లో గుల్నార్స్‌ పర్ఫూమ్స్‌ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ–సిగరెట్లను కేంద్రం నిషేధించినా... సుగంధ ద్రవ్యాల ముసుగులో ఈ–సిగరెట్లు, అందులో వినియోగించే ఫ్లేవర్లు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు కె.శ్రీనివాసులు, టి.శ్రీధర్‌ దాడి చేశారు. ఆరిఫ్‌ అలీని అదుపులోకి తీసుకున్న అతడి  నుంచి 35 ఈ–సిగరెట్‌ మిషన్లు, అందులో వాడే ఫ్లేవర్స్‌ బాటిల్స్‌ 68 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ అబిడ్స్‌ పోలీసులకు అప్పగించారు. ఇక పై నగరంలో ఈ–సిగరెట్లపై నిఘా కొనసాగుతుందని, చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు