మత్స్య రహస్యం!

10 Feb, 2018 20:29 IST|Sakshi

జిల్లాలో గడపదాటని ప్రభుత్వ పథకాలు..!స్కీములపై నోరు విప్పని అధికారులు

కనీసం కార్మికులకు సైతం చెప్పని పరిస్థితి

అయిన వారికే ఇక్కడ పెద్దపీట

చేతులు తడిపిన వారికే పథకం మంజూరు?

‘‘ అధికారి గారు.. జిల్లాలో ఏ పథకం అమలవుతుంది..వాటి వివరాలు ఏమైనా చెబుతారా’’ అని అడిగితే..అన్ని పథకాలు అమలవుతున్నాయి’’ అన్న సమాధానం వస్తోంది. ‘‘ఏయే పథకాలో వివరంగా చెబుతారా’’..అని మళ్లీ అడిగితే..‘‘అన్ని పథకాలు అని చెప్పాముగా..ఇంకేం కావాలి.’’ అంటూ ఒకింత అసహనం వ్యక్తం
చేస్తున్నారు ఇక్కడి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది. ఇదండీ జిల్లా మత్స్యశాఖ పరిస్థితి. ఇక్కడ అంతా రహస్యమే. ఏ పథకం కింద ఎవరు లబ్ధిపొందుతున్నారో సమాచారం ఇవ్వరు. అసలు పథకంకింద లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారో..చేయడం లేదో తెలియని పరిస్థితి.

నల్లగొండ టూటౌన్‌ :   మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచితంగా చేప పిల్లల  పంపిణీకి శ్రీకారం చుట్టి వారికి అన్ని విధాలా మేమున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. అందుకు భిన్నంగా జిల్లా మత్స్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారుల సంక్షేమానికి కేసీఆర్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.  పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న మత్స్యకార్మికులకు తెలియజేయకుండా ఏ ఒక్క పథకంపైనా సంబంధిత అధికారులు నోరు విప్పకుండా వింత పోకడపోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వాల నుంచి ఏయే పథకాలు వస్తున్నాయన్న వివరాలను కూడా మత్స్యకారులకు తెలియనీయకుండా కార్యాలయంలోని కొంతమంది అధికారులు తమకు నచ్చినవారికి మాత్రమే సమాచారం ఇచ్చి ‘చేతులు చాచుతున్నారు’ అనే విమర్శలు ఉన్నాయి. ఫలానా పథకం మంజూరైంది..ఇన్ని యూనిట్లు ఉన్నాయి..అర్హులు దరఖాస్తు చేసుకోవాలి అన్న సమాచారాన్ని కనీసం పత్రికల ద్వారా కూడా ప్రకటన జారీ చేయకుండా అంతా రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో ఈ శాఖలో ప్రభుత్వ పథకాలు గడప దాటడంలేదు.

ఎందుకింత రహస్యం?
ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో కా ర్మికులందరికి తెలియజేసే బాధ్యతను మత్స్యశాఖ అధికారులు విస్మరించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి పథకం గురించి మీడి యా ద్వారా ప్రచారం కల్పించాల్సి ఉన్నా ఆ విధంగా చేసిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు.  జిల్లాలో 147 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా సభ్యులు 25 వేల మంది వరకు ఉన్నారు. మొత్తం మత్స్యకారుల సంఖ్య సుమారు 90 వేల పైబడే ఉన్న ట్లు  తెలుస్తుంది. వీరి సంక్షేమానికి ప్ర భుత్వం టాటా ఏసీ ట్రాలీ వాహనాలు, టీవీఎస్‌ మోపెడ్‌ బైక్‌లు, చేపలు పట్టే వలలు, మహిళా సభ్యులకు స బ్సిడీ రుణాలు, ఐస్‌ బాక్సులు, త దితర వా టిని సబ్సిడీపై అందజేస్తుంది. ఆయా పథకాలపై సంబందిత అధికారులు మ త్స్యకారులకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై పలు అ నుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త మకు నచ్చిన వారికి మాత్రమే తె లి సేలా సంఘం అధ్యక్షుడికి, లేదంటే వా రికి అనుకూలంగా ఉండే సభ్యులకు మాత్రమే సమాచారం చేరవేస్తున్నారనే పలువురు మత్స్యకార్మికులు ఆరోపిస్తున్నారు.

మూలన పడిన బడ్జెట్‌ ...
2016–17 సంవత్సరానికి సంబంధించి మత్స్యకార్మికుల కోసం ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేసింది. దాదాపు రూ.కోటికి పైగా బడ్జెట్‌ ఉన్నా అర్హులైన వారికి నేటికీ పథకాలు అందించలేదు. చేపల విక్రయానికి టాటా ఏసీ ట్రాలీ వాహనాలు, టీవీఎస్‌ మోపెడ్‌లు  కార్మికులకు ఎంతో అవసరం ఉన్నా వాటి గురించి అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదనే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లు దాటినా పథకాలు అబ్ధిదారులకు ఇవ్వడానికి అధికారులకు తీరిక లేదా, వారికి కావాల్సినవి ముట్టలేదా అనే ఆరోపణలు వస్తున్నాయి.

అలాంటిది ఏమీ లేదు
ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరితను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు అందించడానికి లబ్ధిదారుల జాబితా తయారు చేశామన్నారు. 2016–17 సంవత్సరంలో మాత్రమే వాహనాల బడ్జెట్‌ వచ్చిందని, సిబ్బంది ద్వారా మత్స్యకారులకు తెలియజేస్తున్నామని చెప్పారు. త్వరలోనే అందిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు