రాష్ట్రం... నిప్పుల కుంపటి!  

7 May, 2019 03:23 IST|Sakshi

ఖమ్మంలో అత్యధికంగా 46 డిగ్రీలు  

మరో మూడ్రోజులు పలుచోట్ల వడగాడ్పులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం నిప్పుల కుంపటిగా మండిపోతోంది. వడగాడ్పులు వీస్తుండటంతో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావడానికి భయపడిపోతున్నారు. పట్టణాలు, నగరాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. నల్లగొండలో 45 డిగ్రీలు, ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, రామగుండంల్లో 44 డిగ్రీలు, మహబూబ్‌నగర్, మెదక్‌ల్లో 43 డిగ్రీలు, హన్మకొండ, హైదరాబాద్‌ల్లో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం విలవిలలాడిపోతున్నారు. పలుచోట్ల కలుషిత నీటి వల్ల వాంతులు, విరోచనాల బారిన పడుతున్నారు. మే నెల మొత్తం దాదాపు వడగాడ్పుల రోజులు అధికంగా ఉంటాయని, రానున్న రోజుల్లో 47–48 డిగ్రీలకూ ఉష్ణోగ్రతలు పెగోచ్చని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇదిలావుండగా దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోమోరిన్‌ ప్రాంతం వరకు తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ఏమీ ఉండదని, రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని రాజారావు తెలిపారు.  

వడదెబ్బతో ఐదుగురి మృతి 
సాక్షి నెట్‌వర్క్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో సోమవారం ఐదుగురు మృతి చెందారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఓ గుర్తు తెలియనివ్యక్తి, అశ్వారావు పేట మండలం నారాయణపురం కాలనీకి చెందిన బుర్రి వెంకటేష్‌(40), అదే మండలం తిరుమల కుం టకు చెందిన మడకం నాగేశ్వరరావు (55), బూర్గంపాడు గౌతమీపురం కాలనీకి చెందిన మేకల రామలక్ష్మి(65), సత్తుపల్లి మండలం గౌరీగూడెంకి చెందిన పట్లె కుమారి(44) వడదెబ్బతో మృతి చెందారు. 

మరిన్ని వార్తలు