పార్టీల ఎజెండా ఏదైనా.. ‘జెండా’ సిరిసిల్లదే..!

25 Mar, 2019 10:50 IST|Sakshi

దేశమంతా సరఫరా..

సిరిసిల్లకు ‘ఎన్నికల’ ఉపాధి.. 

సాక్షి, సిరిసిల్ల :ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో 1500 మంది ఉపాధి పొందుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి పార్లమెంట్‌ ఎన్నికల వరకు సిరిసిల్లలో సందడి నెలకొంది. ఏ పార్టీకి అయినా.. ఎజెండా లేకున్నా.. సరే కానీ ఆ పార్టీ జెండాలు లేకుంటే.. కుదరని పరిస్థితి నెలకొంది. పార్టీ అధినేతలు ప్రచారానికి వచ్చినా.. ఊరూరా ఎన్నికల ప్రచారం చేసినా.. జెండాలు, కండువాలు తప్పని సరి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచే అన్ని పార్టీలకు సిరిసిల్ల వస్త్రపరిశ్రమ జెండాలను సరఫరా చేస్తోంది. ఫలితంగా ఊరంతా ఉపాధి పొందుతోంది.

బట్ట నుంచి బ్యానర్ల వరకు.. 
ఎన్నికలు ఏవైనా, పార్టీలేవైనా.. అభ్యర్థి ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వినియోగించే జెండాలు, కండువాలు వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్ల నుంచే సరఫరా అవుతాయి. వస్త్ర పరిశ్రమకు నిలయమైన సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మగ్గాలపై పాలిస్టర్‌ వస్త్రోత్పత్తి సాగుతుండగా.. మరో ఏడు వేల మగ్గాలపై కాటన్‌ వస్త్రం ఉత్పత్తి అవుతోంది. పాలిస్టర్‌ బట్టపై ఆర్డర్‌ వచ్చినట్లుగా వివిధ పార్టీల గుర్తులు, రంగులు, అభ్యర్థుల పేర్లు ప్రింటింగ్‌ చేసి సరఫరా చేస్తారు. పాలిస్టర్‌ బట్టను పార్టీ రంగుల్లో ప్రాసెసింగ్‌ చేయించి సరఫరా చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాటు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు సిరిసిల్ల నుంచి ప్రచార సామగ్రి ఎగుమతి అవుతోంది. దేశవ్యాప్తంగా సిరిసిల్లలో తయారైన జెండాలు ఎన్నికల వేళ రెపరెపలాడుతున్నాయి.

సిరిసిల్లలోనే చౌక..  
దేశంలోని బీవండి, సూరత్, మాలేగావ్‌ ప్రాంతాల్లో మరమగ్గాలపై పాలిస్టర్‌ గుడ్డ ఉత్పత్తి అవుతున్నా.. అక్కడ ఉత్పత్తి అయ్యే వస్త్రం సిరిసిల్ల వస్త్రంలాగా చౌకగా లభించదు. దీంతో హైదరాబాద్‌కు చెందిన మర్వాడీ సేట్లు.. దేశంలోని వివిధ ప్రాంతాల పార్టీల ఆర్డర్లు ముందుగానే తీసుకుని సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తారు. ఒక్క బ్యానర్‌ను సైజును బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు ఉంటుంది. కండువా, జెండాలకు రూ.25 నుంచి రూ.50, టోపీ (క్యాప్‌)లకు రూ.20 నుంచి 30 వరకు తోరణాల జెండాలు పదివేల జెండాలకు రూ.3000 నుంచి రూ.4000 వరకు అమ్ముతారు. బహిరంగ సభల్లో వినియోగించే భారీసైజు బ్యానర్లను సైతం ఇక్కడే ముద్రించి ఇస్తారు. వీఐపీ కండువాలను రూ.100 ఒక్కటి సరఫరా చేస్తారు.

రూ.5కోట్ల మేర వ్యాపారం.. 
ప్రతి ఎన్నికల సమయంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు రూ. 5 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. ఇక్కడికి ఆర్డర్లు రావడం కొత్తేం కాదు. సిరిసిల్ల నేతన్నలు గత నలుబై ఏళ్లుగా జెండాలు అందిస్తున్నారు. 1978లో తొలుత సిరిసిల్లలో రామ్‌బలరామ్‌ స్క్రీన్‌పింటర్స్‌ రంగురంగుల పార్టీల జెండాలను ముద్రించడం ఆరంభించింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ, వైఎస్సార్‌సీపీ, బహుజన సమాజ్‌పార్టీ, జనసేన, ఇలా ఏ పార్టీ అయినా ఆయా పార్టీల రంగుల్లో జెండాలను ప్రింట్‌ చేసి అందిస్తారు. అభ్యర్థుల పేర్లు, నినాదాలు సైతం బట్టపై అద్దడం విశేషం.

ఎన్ని‘కళ’
సిరిసిల్లలో పాతిక వేల కుటుంబాలు వస్త్రోత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. తరచూ ఆటుపోట్లతో వస్త్రపరిశ్రమ సంక్షోభానికి గురికావడం, ఉపాధి లేక పోవడం వంటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఉత్పత్తి ఆర్డర్లు, ఎన్నికల ప్రచార సామగ్రి ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతి నిండా పని లభిస్తోంది. ఎన్నికల సామగ్రి సరఫరాతో 500 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జెండాలను కుట్టుమిషన్లపై కుట్టే పనిలో మరో వెయ్యి మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడే బట్ట తయారు కావడంతో ఇక్కడి కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) జెండా ఆర్డర్లు సైతం సిరిసిల్లకు రావడం విశేషం. 

చేదు అనుభవం.. 
మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తొలిసారి సిరిసిల్లకే వచ్చారు. ప్రజాచైతన్య యాత్రను సిరిసిల్ల నుంచే శ్రీకారం చుట్టడం భారీ ఎత్తున పీఆర్పీ జెండాలు, కండువాల ఆర్డర్లు వచ్చాయి. ఆర్డర్లు ఇచ్చిన ఆ పార్టీ నేతలు ఆర్డర్లకు డబ్బులు ఇవ్వలేదు. ప్రచార సామగ్రిని తీసుకెళ్లలేదు. దీంతో సిరిసిల్ల వస్త్రవ్యాపారులు ఉద్దేర భేరానికి స్వస్తి పలికారు. 

‘‘మిషన్‌పై జెండాలు కుడుతున్న ఈమె మేర్గు లావణ్య. సిరిసిల్లలోని వెంకట్రావునగర్‌. లావణ్య రోజుకు వెయ్యి జెండాలు కుడుతుంది. ఒక్కో జెండాకు 25పైసల చొప్పున రోజుకు రూ.250 కూలి లభిస్తోంది. నెలకు సగటున లావణ్య ఇంట్లో ఉంటూనే రూ.5వేలు సంపాదిస్తోంది. లావణ్య భర్త శ్రీనివాస్‌ నేత కార్మికుడు. సాంచాలు నడుపుతూ నెలకు రూ. 8వేలు సంపాదిస్తాడు. ఇంట్లోనే పాపను చూసుకుంటూ లావణ్య ఉపాధి పొందుతోంది’’.

‘‘ఈమె కాటబత్తిని అనిత. సిరిసిల్ల సాయినగర్‌. అనిత పార్టీల జెండాలు, కండువాల, క్యాప్‌లు కట్‌చేస్తూ.. సరిచేస్తూ.. నెలకు రూ.6వేల వరకు సంపాదిస్తోంది. ఆమె భర్త సత్యనారాయణ డయింగ్‌ కార్మికుడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలను పోషించేందుకు బీడీలు చేసేది. రోజుకు వెయ్యి బీడీలు చేసినా.. నెలకు రూ.3వేలకు మించి రాకపోయేవి. ఈ డబ్బులతో ఇల్లు కిరాయి చెల్లిస్తూ.. పిల్లలను సాకడం కష్టమైంది. దీంతో ఆమె పార్టీల జెండాల తయారీ కార్ఖానాలో పనికి చేరింది. దీంతో ఇప్పుడు రూ.6వేలు వస్తున్నాయి. ప్రభుత్వం వితంతు పింఛన్‌ రూ.వెయ్యి ఇస్తోంది. పిల్లలను చదివిస్తోంది’’.

16 ఏళ్లుగా ఇదే పని 
నేను 2002 నుంచి 16 ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నాను. ఎన్నికల సమయంలో కొద్దిగా ఎక్కు వ పని ఉంటుంది. మిగితా రోజు ల్లో స్కూల్, కాలేజీల బ్యా నర్లు, యాగాలు, యజ్ఞాల కండువాలు, జెం డాలు సరఫరా చేస్తాను. ఏడాది పొడువునా ఇ దే పని ఉంటుంది. నా వద్ద 25 మంది కార్మికు లు పని చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. దేశమంతా సరఫరా చేస్తున్నాను.
– ద్యావనపల్లి మురళి, వ్యాపారి

చదువుకుంటూ.. సంపాదిస్తూ 
నేను ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న. మా అమ్మ నిర్మలతో పాటు నేను జెండాలు కుడుతాను. చదువుకుంటేనే తీరిక వేళల్లో పనిచేస్తాను. రెండు మిషన్లు ఉన్నాయి. అంతకు ముందు మా అమ్మ బీడీలు చేసేది. బీడీల పని కంటే ఈ పని బాగుంది. మంచి ఉపాధి లభిస్తుంది. ఇంటి వద్దనే నీడ పట్టున ఉండి పని చేస్తాం. ఎన్నికల రోజుల్లో పని ఎక్కువగా ఉంటుంది.
– సామల దీప్తి, ఇంటర్‌ విద్యార్థి  

మరిన్ని వార్తలు