కుళ్లిన మాంసం.. పాడైపోయిన కూరలు

24 Jul, 2019 13:28 IST|Sakshi
చికిత్స పొందుతున్న విద్యార్థినులు

అధ్వానంగా వసతి గృహాల నిర్వహణ

రాత్రి మిగిలిన వంటలు ఉదయం వడ్డింపు

కలుషిత ఆహారం తిని తరచూ విద్యార్థులకు అస్వస్థత

తనిఖీలు, నియంత్రణ కరువు

నిర్వాహకుల ఇష్టారాజ్యం

సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్, కొండాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీ హాస్టల్‌లో గతవారం కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విజయనగర్‌ కాలనీ మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఆ మర్నాడే కలుషిత ఆహారం తిని 32 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ పాలిటెక్నిక్‌ కళాశాల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 10 మంది విద్యార్థునులు ఆస్పత్రిలో చేరారు. సికింద్రాబాద్‌ వైఎంసీఏలో ఉపాధిహామీ కోర్సుల్లో శిక్షణ కోసం చేరిన నిరుద్యోగులు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. నగరంలో ఇటీవల నగరంలో రోజూ ఏదో ఒక వసతిగృహంలో ఆహారం కలుషితమవుతూనే ఉంది. ఫుడ్‌కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగా తరచూ పలువురు విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు ఆయా వసతి వసతిగృహాల్లో తనిఖీలు నిర్వహించి ఆహార నాణ్యతను పరిశీలించాల్సిన జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతి గృహాల ఏర్పాటుకు  స్పష్టమైన విధివిధానాలు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు లేని భవనాల్లో వీటిని ఏర్పాటు చేస్తుండటం, మార్కెట్లో తక్కువ ధరకు లభించే కూరలు, మాంసం, నూనెలు వినియోగిస్తుండటంతో ఆహారం కలుషితమై విద్యార్థులు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

వసతి గృహాలపై నియంత్రణ ఏదీ?
గ్రేటర్‌ పరిధిలో కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలు, వాటికి చెందిన హాస్టళ్లు 500 పైగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు 100 వరకు ఉన్నాయి. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలకు అనుబంధంగా మరో 100 హాస్టళ్లు నడుస్తున్నాయి. వీటికితోడు వివిధ పోటీ పరీక్షల కోసం సన్నద్ధ మవుతున్న అనేక మంది నిరుద్యోగులు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్, రామంతాపూర్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో లెక్కలేనన్ని హాస్టళ్లు ఉన్నాయి. చాలా మంది రద్దీ ప్రాంతాల్లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని, బోయ్స్, లేడీస్‌ హాస్టళ్లను ఓపెన్‌ చేస్తున్నారు. ఒక్కో గదిలో ఐదు నుంచి పది మందికి వసతి కల్పిస్తున్నారు. ఇక హోటళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ గల్లీలోకి చూసినా ఏదో ఒక హో టల్‌ కన్పిస్తుంది. రుచికరమైన నాణ్యమైన ఆహారంతో పాటు అహ్లాదకరమైన వాతావరణంలో వసతి కల్పిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి ఆయా వసతి గృహాల్లోని వంటగదుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంటుంది. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే పుచ్చి, పాడైపోయిన కూరగాయలు, కుళ్లిన మాంసంతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తున్నారు. రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని కిచిడీ రూపంలో ఉదయం టిఫిన్‌గా పెడుతున్నారు. కూరలు, పప్పు, సాంబార్‌ సహా ఇతర వంటలను వేడిచేసి మళ్లీ వడ్డిస్తున్నారు. ఈ కలుషిత ఆహారం తినడంతో విద్యార్థులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరంతో తీవ్ర అవస్వస్థతకు గురై చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలపై నియంత్రణ లేకపోవడం, అధికారులు వీటిని తనిఖీ చేయకపోవడం, ఎప్పటికప్పుడు ఆహారం నాణ్యతను పరిశీలించకపోవడం వల్ల నిర్వహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. అనుకోని విపత్తు లు, అగ్ని ప్రమాదాలు జరిగితే..ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు లేవు. అంతేకాదు నగరంలోని వసతి గృహాల్లో 90 శాతం భవ నాలకు ఫైర్‌ సేఫ్టీ లేదంటే ఆశ్చర్యపోనవసరంలేదు.

పని చేయని ‘మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌’..
కల్తీ ఆహార పదార్థాల భారి నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో ఐపీఎంలో మొబైల్‌ ఫుడ్‌ సేప్టీ ల్యాబ్‌ను ప్రారంభిం చింది. నారాయణగూడ పరిసర ప్రాంతాలు సహా కుత్బుల్లాపూర్‌లో పర్యటించి హోటళ్లలో ఆహార పదార్థాల నమూనాలు సేకరించి...పరీక్షల పేరుతో హడావుడి చేసింది. ఆ తర్వాత విస్మరించింది. ప్రస్తుతం ఈ వాహనం జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు ఐపీఎం అధికారులు చెబుతున్నారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షించాల్సిన ఈ మొబైల్‌ ఫుడ్‌ సేప్టీ ల్యాబ్‌ వెహికిల్‌ ప్రస్తుతం కేవలం పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలకే పరిమితమైంది. కలుషిత ఆహారంతో ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రుల్లో చేసిన బాధితుల్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప...జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.   

మరిన్ని వార్తలు