భారతీయ సంస్కృతి గొప్పది

4 Oct, 2017 11:16 IST|Sakshi
మగ్గాన్ని పరిశీలిస్తున్న విదేశీయులు

విదేశీ అధికారుల కితాబు

పోచంపల్లిని సందర్శించిన 19 దేశాలకు చెందిన 28 మంది అధికారులు

నల్లగొండ ,భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు చాలా గొప్పగా ఉన్నాయని విదేశీ అధికారుల బృందం కొనియాడింది. మంగళవారం హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, లఘు, మధ్యపరిశ్రమల సంస్థ(నిమిస్మే) ఆధ్వర్యంలో 19 దేశాలకు చెందిన 28 మంది విదేశీ అధికారుల బృందం పోచంపల్లిని సందర్శించింది. స్థానిక టూరిజం సెంటర్, చేనేత గృహాలను సందర్శించి ప్రాచీన చేనేత కళ, దానికున్న ఆదరణను అడిగి తెలుసుకున్నారు. మగ్గాలపై తయారవుతున్న చేనేత ఇక్కత్‌ వస్త్రాల తయారీని ప్రత్యకంగా పరిశీలించి కార్మికుల కళా నైపుణ్యాలను అభినందించారు. అలాగే చేనేత గృహాలకు వెళ్లి వారి జీవనశైలి, లభిస్తున్న కూలిని అడిగి తెలుసుకున్నారు.

చేనేతతో పాటు చేతివృత్తులపై ఎంత మంది ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని ఆరా తీశారు. కాగా గ్రామీణ ప్రజల జీవన విధానాలు, ఆచారాలను చూసి అబ్బురపడ్డారు. ఎంతో వైవిధ్యంగా ఉన్న భారతీయ సంస్కృతి చాలా గొప్పగా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రొగ్రాం డైరెక్టర్‌ టి.వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ నిమిస్మేలో ‘టూరిజం అండ్‌ హాస్పిటలిటీ మేనేజ్‌మెంట్‌’లో 3 నెలల పాటు అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటన నిమిత్తం ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, కాంబోడియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాక్, జోర్డాన్, కజకిస్తాన్, కెన్యా, లిబేరియా, మాలి, మారిషస్, మంగోలియా, నైగర్, శ్రీలంక, తజకిస్తాన్, టాంజానియా, వియత్నాం, జాంబియా దేశాలకు చెందిన టూరిజం, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్, ప్రొగ్రాం అధికారులు వచ్చారని తెలిపారు.

మరిన్ని వార్తలు