పది నిమిషాలైతే.. ఇంటికి చేరేవారే..

14 Jul, 2014 00:09 IST|Sakshi
పది నిమిషాలైతే.. ఇంటికి చేరేవారే..

కోహీర్: మరో పది నిమిషాల్లో గమ్యం చేరుతారనగా వారు ప్రయాణిస్తున్న ఆటోను మృత్యు రూపంలో వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో మూడు పదుల వయసు దాటని నలుగురు వ్యక్తులు చనిపోయారు. మృతులంతా జహీరాబాద్ వాసులే.. పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మండలంలోని దిగ్వాల్ గ్రామ శివారులో తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి చోటు చేసుకొంది. పోలీసుల సమాచారం ప్రకారం.. హైదరాబాద్ వైపు నుంచి జహీరాబాద్ వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది.
 
 దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అల్తాఫ్(24), లక్ష్మమ్మ(24), శ్రీదేవి(22) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, సయ్యద్ జాకీర్(29) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి మహ్మద్ అలీ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వాహనం తాకిడికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. అల్తాఫ్, జాకీర్, అలీ ముగ్గురు మిత్రులు. ఆటోను జాకీ ర్ తోలుతూ జహీరాబాద్ వస్తున్నారు. మార్గ మధ్యలో కోహీర్ చౌరస్తా వద్ద లక్ష్మమ్మ, శ్రీదేవి ఆటోలో ఎక్కారు. అంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది.
 
   అల్తాఫ్ జహీరాబాద్ శాంతినగర్ నివాసి. పెళ్లి కాలేదు. ఆటో గ్యారేజ్ నడుపుతున్నాడు. జాకీర్ రాంనగర్  నివాసి. అతనికి భార్య, ఏడాది కూతురు ఉంది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లక్ష్మమ్మ, శ్రీదేవిల ఆచూకీ లభించకపోవడంతో వారి ఫొటోలను పట్టణం వీధుల్లో ఉంచడంతో సాయంత్రానికి గుర్తుపట్టారు.
 
  లక్ష్మమ్మ బాగిరెడ్డిపల్లి వాసి. భర్త, కూతురు ఉన్నారు. వివాహిత అయిన శ్రీదేవి బాగారెడ్డిపల్లి గాంధీనగర్ నివాసి. జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించి జహీరాబాద్ రూరల్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో కోహీర్ ఎస్‌ఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు