మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో అడ్డగోలు దోపిడీకి చెల్లు

1 Apr, 2018 01:35 IST|Sakshi

బేషరతుగా తొలి అర గంట ఉచితం 

సరుకులు కొనుగోలు చేస్తే గంట వరకు ఫ్రీ 

గంట దాటితే కొనుగోళ్లను బట్టి చార్జీ 

పార్కింగ్‌ ఫీజుల క్రమబద్ధీకరణ అమలులోకి.. 

సాక్షి, హైదరాబాద్ ‌: షాపింగ్‌ మాల్స్‌.. మల్టీప్లెక్స్‌లు.. ఇతరత్రా వాణిజ్య ప్రదేశాల్లో పార్కింగ్‌ దోపిడీకి ఇకపై చెక్‌ పడనుంది. గంటల లెక్కన ఇష్టారీతిన సాగుతున్న పార్కింగ్‌ ఫీజుల వసూలు నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఇకపై మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో తొలి అరగంట వరకు పార్కింగ్‌ ఉచితం. ఆ తర్వాత పార్కింగ్‌ చేసే సమయం.. నిబంధనలను బట్టి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయనున్నారు. వాణిజ్య ప్రాంతాలు, షాపింగ్‌ మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ ఫీజుల్ని క్రమబద్ధీకరిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆదివారం నుంచి నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పార్కింగ్‌ ఫీజుల్ని వసూలు చేయాలి. అలా కాక ఇష్టానుసారం వసూలు చేసే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అధికారం జీహెచ్‌ఎంసీకి ఉంది. ఈ మేరకు మాల్స్, మల్టీప్లెక్స్‌ల యజమానులతో జీహెచ్‌ఎంసీ సమావేశం నిర్వహించి స్పష్టం చేసింది. ఈ భేటీలో వారు వ్యక్తపరచిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించింది. అయితే పార్కింగ్‌ పాలసీని మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని వారికి స్పష్టం చేసింది. 

తొలి అరగంట ఉచితం.. 
మార్చి 20న ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు వాణిజ్య ప్రదేశాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో తొలి అరగంట వరకు సరుకులు కొన్నా, కొనకపోయినా ఉచితం. ఆ తర్వాత పార్కింగ్‌ చేసే సమయాన్ని బట్టి పార్కింగ్‌ ఫీజు ఎలా వసూలు చేయవచ్చో స్పష్టం చేసి.. వాటిని తప్పక పాటించాలని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. ఈ వివరాలు ప్రజలకు తెలిసేలా పార్కింగ్‌ ప్రదేశాల్లో డిజిటల్‌గా ప్రదర్శించడం, జీవో ప్రతిని అంటించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. వాహనం పార్కింగ్‌ చేసిన సమయాన్ని తప్పకుండా నమోదు చేయాలని, ఇందుకుగానూ స్టాంప్‌ వేయడమో, లేక తగిన డివైజ్‌ను వినియోగించడమో చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి సూచించారు. 

పార్కింగ్‌ ఫ్రీ ఇలా.. 

  • పార్కింగ్‌ ప్రదేశంలో ఉంచిన వాహనానికి 30 నిమి షాల వరకు ఎలాంటి ఫీజు వసూలు చేయరు. కొను గోలు చేసినా, చేయకపోయినా పార్కింగ్‌ ఫీజు అడగరాదు. అంటే బేషరతుగా పార్కింగ్‌ పూర్తి ఉచితం. 
  • అరగంట దాటితే మాత్రం సంబంధిత మాల్, వాణిజ్య ప్రదేశంలో ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపించాలి. ఎంతో కొంత కొనుగోలు చేసిన వారైనా సరే ఈ సదుపాయం ద్వారా గంట సేపటి వరకు తమ వాహనానికి ఎలాంటి పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. కొనుగోలు బిల్లు చూపించకపోతే మాత్రం నిర్ణీత పార్కింగ్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 
  • గంట కంటే ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచే వారు కొనుగోలు చేసిన బిల్లును కానీ, మూవీ టికెట్‌ను కానీ చూపించాలి. ఈ బిల్లు, మూవీ టికెట్‌ ధర పార్కింగ్‌ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయరు. పార్కింగ్‌ ఫీజు కంటే తక్కువుండే పక్షంలో నిర్ణీత పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.  

ఫిర్యాదులు.. కోర్టు ఆదేశాలతోనే..
జీహెచ్‌ఎంసీలో దాదాపు 25 మల్టీప్లెక్స్‌లతోపాటు పలు షాపింగ్‌ మాల్స్, వాణిజ్య ప్రదేశాలు ఉన్నాయి. నగరంలోని వివిధ మాల్స్, మల్లీప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ ఫీజులు భారీగా ఉండటంపై ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు, భవన నిర్మాణ నిబంధనలు, పార్కింగ్‌ ఫీజుల విషయంలో హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పార్కింగ్‌ ఫీజుల క్రమబద్ధీకరణకు జీవో తెచ్చింది. గ్రేటర్‌లో ప్రస్తుతం పార్కింగ్‌ ఫీజులు ద్విచక్ర వాహనాలకు తొలి రెండు గంటల వరకు రూ.20, కార్లకు రూ.30గా ఉన్నాయి. రెండు గంటలు దాటాక ప్రతి గంటకు ద్విచక్ర వాహనాలకు రూ.10, కార్లకు రూ.20గా ఉంది. ఐదు నిమిషాలే పార్కింగ్‌ చేసినా తొలి రెండు గంటల చార్జీని వసూలు చేస్తుండటంతో ప్రజల నుంచి విమర్శలున్నాయి.

మరిన్ని వార్తలు