ముంపు పసిగట్టి..

9 May, 2020 09:56 IST|Sakshi

రోడ్ల పనులతోపాటే వరదకాలువల నిర్మాణం

సీఆర్‌ఎంపీ కాంట్రాక్టు ఏజెన్సీలకే పనులు

వర్షాకాలం సమస్యలు తగ్గించే చర్యల్లో జీహెచ్‌ఎంసీ

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ సమయాన్ని వినియోగించుకొని ఇప్పటి వరకు ఇంజినీరింగ్‌  పనుల్లో భాగంగా ఫ్లై ఓవర్లు,  రోడ్ల మరమ్మతులు, రీకార్పెటింగ్‌ వంటి పనులు చేపట్టిన జీహెచ్‌ఎంసీ తాజాగా వరదకాలువల పనులూ చేపట్టింది. త్వరలోనే వర్షాకాలం రానుండటంతో నీటిముంపు సమస్య పరిష్కారానికి ఈ చర్యలకు సిద్ధమైంది. నగరంలో వానొస్తే నీరు నిలిచి రోడ్లు చెరువులుగా మారడం.. తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు నగర ప్రజలకు అనుభవమే. ఈ సమస్యల పరిష్కారానికి తీవ్ర సమస్యలున్న ప్రాంతాల్లో వరదనీరు సాఫీగా సాగేందుకు వరదకాలువల నిర్మాణానికి సిద్ధమైంది. సీఆర్‌ఎంపీలో భాగంగా రోడ్డు నిర్వహణ పనులు చేస్తున్న పేరెన్నికగన్న కాంట్రాక్టు ఏజెన్సీలకే ఈపనులు అప్పగించింది. గ్రేటర్‌ పరిధిలోని ప్రధాన రహదారుల మార్గాల్లో దాదాపు 709 కి.మీ.ల మేర రహదారుల నిర్వహణను కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇవ్వడం.. అవి పనులు చేస్తుండటం తెలిసిందే. పనిలో పనిగా రోడ్ల పనులతోపాటు నీటి నిల్వసమస్యలు లేకుండా రోడ్ల వెంబడి వరదకాలువ పనులను కూడా వాటికి అప్పగించింది.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు వడివడిగా జరుగుతున్నాయి.  నగరంలో ముంపు సమస్యలకు ప్రధాన కారణం నాలాల్లోంచి నీరు పారే దారి లేకపోవడం. వరదనీరు వెళ్లే మార్గం లేకే రోడ్లపై నీరు నిలుస్తోంది. పెద్ద నాలాల విస్తరణ పనులను ప్రాజెక్టŠస్‌ విభాగం చేస్తోంది. నాలాల ఆధునీకరణ, విస్తరణలకు భూసేకరణ సమస్యగా మారడంతో ఆ పనుల్లో జాప్యం జరుగుతోంది. నాలాల విస్తరణలు అవసరం లేని చోట, రోడ్లపైకి నీరు చేరకుండా వరదకాలువల గుండా నీరు వెళ్లేందుకు భూసేకరణలు అవసరం లేని చోట రోడ్ల నిర్వహణ పనులతోపాటు  ఈ వరదకాలువల పనులు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి కవాడిగూడ రోడ్, కర్బలామైదాన్, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టినట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. తొలిదశలో దాదాపు 20 ప్రాంతాల్లో ఈ వరదకాలువల పనులకు సిద్ధమయ్యారు. ఆమేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పొంది రోడ్ల పనులు చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలకే ఆపనులు అప్పగిస్తున్నారు.  అవసరమైన ప్రాంతాల్లో వరదకాలువలు, భూగర్భ డ్రైనేజీలు, క్యాచ్‌పిట్స్‌ , మ్యాన్‌హోల్స్‌ పనులు చేయవవచ్చునని కాంట్రాక్టు ఒప్పందంలోనే ఉంది. అయితే రోడ్డు పనుల ఐదేళ్ల నిర్వహణలో భాగంగా కాకుండా ఈ అదనపు పనులకు అదనపు నిధులు చెల్లించనున్నారు. 

సీఆర్‌ఎంపీలో భాగంగా..
సీఆర్‌ఎంపీలో భాగంగా దాదాపు 709 కి.మీ.ల రోడ్ల నిర్వహణను ప్రైవేటు కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పగించారు. ఐదేళ్లపాటు నిర్వహణ కూడా వాటిదే. రోడ్లతోపాటు పచ్చదనం, పారిశుద్ధ్యం వంటి బాధ్యతలు కూడా వాటికే ఉన్నాయి. ఒప్పందంలో భాగంగా మొదటి సంవత్సరం 50 శాతం మేర రోడ్ల రీకార్పెటింగ్‌ పనులు చేయాల్సి ఉంది. దాదాపు ఆర్నెళ్లలో లాక్‌డౌన్‌  ముందు వరకు పనులు మందకొడిగా జరిగినప్పటికీ, లాక్‌డౌన్‌ నుంచి పనుల వేగం పెరిగింది.

మరిన్ని వార్తలు