బోనమెత్తిన భాగ్యనగరి

16 Jul, 2018 02:32 IST|Sakshi

ఘనంగా ప్రారంభమైన జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్, నాయిని, పద్మారావు, తలసాని

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

సాక్షి, హైదరాబాద్‌: గోల్కొండ కోట జనసంద్రమైంది. ఆదివారం ప్రారంభమైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలకు జనం వేలాదిగా తరలి వచ్చారు. అశేష జనవాహిని మధ్య లంగర్‌హౌస్‌ నుంచి ప్రారంభమైన అమ్మవారి తొట్టెల ఊరేగింపు ఫతే దర్వాజా, చోటా బజార్, బడా బజార్, గోల్కొండ చౌరస్తాల గుండా కోటకు చేరుకుంది. భారీ తొట్టెల కోట ప్రధాన ద్వారం నుంచి అమ్మవారి ఆలయం వరకు ముందుకు సాగగా.. భక్తులు వెంట వెళ్లారు.

మరోవైపు గోల్కొండ బంజార దర్వాజ నుంచి పటేలమ్మ మొదటి బోనం ఊరేగింపు కఠోర గంజ్, మొహల్లాగంజ్‌ల గుండా కోటకు చేరుకుంది. ఈ సందర్భంగా నగీనా బాగ్‌లోని నాగదేవత ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పద్మారావుగౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కూడా బోనాల ప్రారంభానికి విచ్చేశారు.

ఆలయాలకు రూ.15 కోట్ల నిధులు: ఇంద్రకరణ్‌
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిపూజతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ వినోద్‌ ఆధ్వర్యంలో మంత్రులు లంగర్‌హౌస్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత అమ్మవారికి బోనాల ర్యాలీ ప్రారంభమైంది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. బోనాల సందర్భంగా ఆలయాల అభివృద్ధి కోసం విడుదల చేసిన రూ.15 కోట్ల నిధులు కేవలం జంటనగరాల కోసమేనని చెప్పారు. మిగిలిన జిల్లాలకు కూడా ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నామని వెల్లడించారు.

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. మొదటి రోజు ఉత్సవాలతోనే అధికారులు చేతులు దులుపుకోవద్దని, గోల్కొండలో జరిగే తొమ్మిది వారాల పూజలకు ప్రతి శాఖ అధికారి భక్తులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గోల్కొండ బోనాల ఉత్సవాలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆలయాల అభివృద్ధికి సీఎం పెద్దపీట వేశారని, కేవలం ప్రధాన ఆలయాలకే పరిమితం కాకుండా గల్లీల్లోని చిన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు