‘గుట్ట’కు స్వయంప్రతిపత్తి

18 Nov, 2014 00:36 IST|Sakshi
‘గుట్ట’కు స్వయంప్రతిపత్తి
  • ఆలయ గోపురానికి బంగారు తాపడం
  • గుట్టమీదుగా రీజినల్ రింగ్‌రోడ్డు
  • ప్రత్యేకాధికారిగా కిషన్‌రావు నియామకం
  • ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి  
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను వాటిక న్ సిటీ తరహాలో అభివృద్ధి చేయటానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఉన్నట్టు ఈ క్షేత్రానికి కూడా స్వయం ప్రతిపత్తి కల్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. సోమవారం సచివాలయంలో యాదగిరి క్షేత్ర అభివృద్ధి ప్రణాళికలపై ఆయన సమీక్షించారు.  ప్రభుత్వ సలహాదారు పాపారావు, ప్రత్యేకాధికారి కిషన్‌రావు, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నరసింగరావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

    యాదగిరిగుట్ట అభివృద్ధికి శిల్పారామం ప్రత్యేకాధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి జి.కిషన్‌రావును పర్యవేక్షణాధికారిగా సీఎం నియమించారు. యాదగిరిగుట్ట ఆలయగోపురం స్పష్టంగా  కనిపించేలా చూడాలన్నారు. అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించి పద్ధతిప్రకారం మళ్లీ నిర్మిస్తే ఎలా ఉంటుందని యోచించారు. అలాగే గోపురానికి బంగారు తాపడం చేయించాలని సీఎం ఆదేశించారు.

    రెండువేల ఎకరాలు సేకరించి కల్యాణ మండపాలు, వేదపాఠశాల, సంస్కృత పాఠశాల నిర్మించాలని పేర్కొన్నారు. సమీపంలో స్వామి పేరుతో అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. గుట్టపైన సుగంధ మొక్కలు నాటి పచ్చిక బయళ్లు ఏర్పాటు చేయాలన్నారు. స్వామిదీక్షలు చేసేవారికి, భక్తులకు బహుళఅంతస్తుల భవనాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి దేశంలోనే పెద్దదైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు.

    ఆయా ప్రాంతాలకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టాలని సూచించారు. దారిలో ఉన్న రాయగిరి, గంధమల్ల చెరువు, ఇతర గుట్టలను పర్యాటక ప్రాంతాలుగా తీర్దిదిద్దాలని ఆదేశించారు. ఔటర్ రింగురోడ్డు ఆవల నిర్మించతలపెట్టిన రీజినల్ రింగురోడ్డు యాదగిరి క్షేత్రం మీదుగా వెళ్లేలా చూడాలన్నారు.

>
మరిన్ని వార్తలు