ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలతో సత్ఫలితాలు

15 May, 2017 02:29 IST|Sakshi

పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌
సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు అడ్డుకోడానికి ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్‌ విభాగాలతో సత్ఫలితాలు వస్తున్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చెప్పారు. మండల స్థాయి గిడ్డంగులు, రేషన్‌ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి బియ్యం అక్రమ రవాణాకు బృందాలు చెక్‌ పెడుతున్నాయని పేర్కొన్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృంద ప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించిన సీవీ ఆనంద్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా 179 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.కోటికి పైగా విలువ గల 3,507 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, 937 క్వింటాళ్ల సీఎంఆర్‌ ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అక్రమంగా నిల్వ ఉంచిన రూ.2.15 లక్షల విలువ గల చక్కెర, ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్‌నూ స్వాధీనం చేసుకున్నామని.. రూ.3.16 కోట్ల విలువైన సన్నబియ్యం అక్రమ రవాణా నివారించామని చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘాతో మిల్లర్లకు రావాల్సిన సీఎంఆర్‌ కూడా పూర్తిస్థాయిలో వచ్చిందని.. ఈ బృందాల వల్లరేషన్‌ దుకాణాలు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో పనితీరు మెరుగుపడిందని కమిషనర్‌ వివరించారు.

మరిన్ని వార్తలు