ప్రగతి వెలుగులేవీ?

25 Mar, 2018 07:58 IST|Sakshi
పాలవాగు నుంచి తాగునీటిని తీసుకెళ్తున్న గ్రామస్తులు

పెనుగోలులో కానరాని వసతులు

రోడ్లు, తాగునీటి వసతి గగణమే..

అత్యవసర సమయాల్లో

వైద్యం కోసం కావడే దిక్కు

ఇప్పటికీ బుడ్డి దీపాలే శరణ్యం

సౌకర్యాలు కల్పించాలని ఆదివాసీల వేడుకోలు

వాజేడు: అడవి బిడ్డలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌ ఇలా కనీస వసతులకు నోచుకోలేక ఆదివాసీలు పడరాని పాట్లు పడుతున్నారు. వీరిని కేవలం జనాభా లెక్కలు, ఓట్ల కోసమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు దాటినా వీరి తలరాతలు ఇంకా మారలేదు. వాజేడు మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీలో ఉన్న ఓ కుగ్రామం పెనుగోలు. వాజేడు నుంచి ఈ గ్రామం 18 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే రాళ్ల దారిని దాటాల్సిందే.. ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. ఇక్కడ గతంలో 50 కుటుంబాలు, 200 మంది జనాభా ఉండేది. గుట్టలు దిగిరావాలని అధికారులు పెట్టిన ఒత్తిడి కారణంగా తమ స్వేచ్ఛా జీవితాన్ని వదిలి 25 కుటుంబాల వారు వాజేడు సమీపంలోకి వచ్చి నివాసముంటున్నారు. మిగిలినవారు పెనుగోలులోనే అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్నారు.  

కానరాని రహదారులు
పెనుగోలుకు వెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో రాళ్ల దారిలో వాగులను దాటాల్సి ఉంటుంది. గ్రామస్తులు రేషన్‌ సరుకులు తీసుకోవడానికి సైతం గుమ్మడి దొడ్డికి రావాల్సి ఉంటుంది. ఏ పనికైనా గుట్టలు దిగి రాళ్ల దారి, చెట్లు పుట్టలు, వాగులు వంకలు దాటుకుంటూ రావాల్సిందే..

తాగునీరు లభించదు..
ఈ గ్రామానికి తాగునీటి వనరులు వాగులు, ఓ బావి మాత్రమే. బావిలోని నీరు పచ్చబడి ప్రమాదకరంగా ఉంటుంది. సమీపంలో ఉన్న పాల వాగు, నల్ల వాగుల్లో నీటిని వినియోగిస్తున్నారు.  అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. పెనుగోలు గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం లేదు. గతంలో రెండు పర్యాయాలు సోలార్‌ సిస్టం ద్వారా విద్యుత్‌ను అందించేందుకు సర్వేలను నిర్వహించి మూడో విడతలో ఏర్పాటు చేశారు. కానీ అది పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేదు. దీంతో స్వాతంత్రం వచ్చి 68 ఏళ్లు దాటినా గుట్టలపై ఉన్న గిరిజనులు మాత్రం గుడ్డి దీపాలతోనే జీవనం సాగిస్తున్నారు.

వైద్యం అందని ద్రాక్షే..
అడవిబిడ్డలకు ఏ రోగం, రొప్పి వచ్చినా సరైన వైద్యం అందదు. గుట్టల పై ఉన్న పెనుగోలుకు ప్రభుత్వ వైద్యులు వెళ్లరు. కేవలం ఒక ఏఎన్‌ఎం మాత్రం వెళ్లి వస్తుంటుంది. జ్వరమొచ్చినా, నొప్పి వచ్చినా రోగులు కిందకు రావాల్సిందే.. చికిత్స కోసం రోగులను గుట్టలు దింపి వాజేడు, వెంకటాపురం, భద్రాచలం, వరంగల్‌లోని ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఆస్పత్రికి రోగులను తీసుకురావాలంటే నడిం కావడి ద్వారా ఇద్దరు వ్యక్తులు మోసుకొస్తుంటారు. వైద్యశాలకు చేరితే రోగి ప్రాణాలు దక్కినట్లు. లేకపోతే అంతే.. ఇలా వైద్యం అందక పలువురి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. అధికారులు మాత్రం సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

మంజూరు కాని ఇందిరమ్మ ఇళ్లు
ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతీ పథకానికి నిజమైన లబ్ధిదారులు  పెనుగోలు గిరిజనులు. కానీ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్కటీ అందడం లేదు. వీరికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికీ లభించలేదు   గిరిజనుల కోసం ఏర్పడిన భద్రాచలం ఐటీడీఏ నుంచి పెనుగోలు గిరిజనులకు అందిన  సహాయం ఏ మాత్రం లేదు.  గుట్టపై ఉన్న అడవిబిడ్డలకు పోడు వ్యవసాయమే దిక్కు. అది కూడా వర్షాలు పడితే పండినట్టు లేక పోతే ఎండినట్టు. ఆధునిక వ్యవసాయం చేసే అవకాశం ఏమాత్రం లేదు. ఎరువులు, పురుగు మందులు తీసుకెళ్లే దారి లేదు. దీంతో పోడు వ్యవసాయం చేసి పండిన పంటను అందరూ తింటారు. ముఖ్యంగా జొన్న, సజ్జలను పండిస్తారు. వాటితో పాటు తేనె సేకరించి విక్రయిస్తారు. తమకు అడవిలో దొరికే వెదురుతో గుమ్ములు, బుట్టలు, తడకలు, కోళ్ల గూళ్లు, చాటలు చేసి విక్రయిస్తుంటారు.  మరోవైపు ఇక్కడి గిరిజన విద్యార్థులకు పాఠశాల ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు లేడు. ప్రభుత్వం స్పందించి గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.


 

మరిన్ని వార్తలు