రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

10 May, 2015 01:03 IST|Sakshi

- అన్నదాతలకు అండగా వైఎస్సార్ సీపీ
- కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నర్ర భిక్షపతి
రామచంద్రాపురం:
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ కార్మిక విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నర్ర భిక్షపతి ఆరోపించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ తెలంగాణ వచ్చాక రైతుల బతుకులు మారుతాయని చెప్పారని, ఆయనే ముఖ్యమంత్రి అయినా వారి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రోజు రోజుకూ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయని తెలిపారు. ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నదాతలకు అండగా వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడి రైతుల సమస్యలు తెలుసుకున్నారని, ఆయన ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్, రుణమాఫీ అమలు చేశారని గుర్తు చేశారు. రైతుల కోసం కృషి చేసిన ఆయనను ఎప్పటికీ మరచిపోరని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ నిరంతర పోరాటం సాగిస్తుందని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతు దీక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకుల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు