సర్కారీ స్థలం.. వివాదాస్పదం!

5 Aug, 2019 10:40 IST|Sakshi

వివాదాల్లో 58 శాతం ప్రభుత్వ భూములు  

హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 90.18 ఎకరాల ఖాళీ స్థలం  

వాస్తవ పరిస్థితికి భిన్నంగా ల్యాండ్‌ బ్యాంక్‌ లెక్కలు  

మార్పులుచేర్పులకు రెవెన్యూ యంత్రాంగం సమాయత్తం  

ఏడుగురు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు  

సాక్షి, సిటీబ్యూరో: సర్కారు స్థలాలపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. వాస్తవికతకు, ల్యాండ్‌ బ్యాంక్‌ లెక్కలకు పొంతన లేకపోవడంతో మార్పులుచేర్పులకు సిద్ధమైంది. రెవెన్యూ లెక్కల ప్రకారం జిల్లాలో దాదాపు 90.18 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. దీని విలువ రూ.3,000 కోట్లకు పైనే ఉంటుంది. అయితే ఈ భూమిలో సుమారు 58శాతం వివాదాల్లో చిక్కుకుంది. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో ఆయా స్థలాలు వివాదాస్పదంగా మారాయి. అధికారుల ఉదాసీన వైఖరితో మరికొన్ని స్థలాలు క్రమబద్ధీకరణకు నోచుకున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ బ్యాంక్‌లోని లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతనలేకుండా పోయింది. దీన్ని గమనించిన రెవెన్యూ యంత్రాంగం ల్యాండ్‌ బ్యాంక్‌ స్థలాల అప్‌డేషన్‌కు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏడుగురు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది.  

16 మండలాలు.. 95 పార్శిల్స్‌   
హైదరాబాద్‌ జిల్లా రెవెన్యూ పరిధిలో 16 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 95 ల్యాండ్‌ పార్శిళ్లు ఉండగా... మొత్తం 4,36,471.2 చదరపు గజాల ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇందులో 72 పార్శిళ్లలోని 1,75,595.2 చదరపు గజాల స్థలం ఎలాంటి వివాదాలు లేకుండా సవ్యంగా ఉండగా... మిగిలిన 23 పార్శిళ్లలోని 2,57,972 చదరపు గజాల స్థలం వివాదాల్లో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అత్యధికంగా తిరుమలగిరిలో కేవలం 4 పార్శిళ్లలో 1,84,774.91 చదరపు మీటర్ల ఖాళీ స్థలం ఉండగా... షేక్‌పేటలో 8 పార్శిళ్లలో 74,073.3 చదరపు మీటర్ల స్థలాలు ఉన్నాయి. నాంపల్లి, చార్మినార్‌ మండల పరిధిలో గజం స్థలం కూడా ఖాళీగా లేకపోగా... అమీర్‌పేటలో ఒక్క పార్శిల్‌లో 751 మీటర్ల ఖాళీ స్థలం ఉండగా అది కాస్త వివాదాల్లో చిక్కుకుంది. అత్యధికంగా  గోల్కొండలో 26, ఆసీఫ్‌నగర్‌లో 23 పార్శిళ్లు ఉన్నాయి. 

నాలుగు విభాగాలు...  
ల్యాండ్‌ బ్యాంక్‌లోని పార్శిళ్లను నాలుగు విభాగాలుగా విభజించి మార్పులుచేర్పులు చేస్తున్నారు. ఏ కేటగిరీగా ఒకటికి రెండుసార్లు నమోదైన స్థలాలు, బీ కేటగిరీగా క్రమబద్ధీకరణ స్థలాలు, సీ కేటగిరీగా డిపార్ట్‌మెంట్‌లకు కేటాయించిన స్థలాలు, డీ కేటగిరీగా కోర్టు వివాదాల్లోని స్థలాలుగా విభజిస్తున్నారు. ఈ నెల 15లోగా ల్యాండ్‌ బ్యాంక్‌ను పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. 

మరిన్ని వార్తలు