‘ప్రగతి’ సారథి కావాలి!

17 Jun, 2018 04:04 IST|Sakshi

ఆర్టీసీకి కొత్త ఎండీ కోసం ప్రభుత్వం వెతుకులాట

ప్రస్తుత ఎండీ రమణారావుకు పొడిగింపు ఇవ్వని సీఎం

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత అస్తవ్యస్తంగా మారిన ఆర్టీసీకి ఇప్పుడు జవజీవాలు కల్పించేందుకు ఓ ఆపద్బాంధవుడు కావాలి. నష్టాలతో కునారిల్లుతున్న ప్రగతి రథాన్ని ప్రగతి వైపు నడిపేందుకు సమర్థుడైన సారథి కావాలి. ప్రస్తుతం ఎండీగా ఉన్న రమణారావు పదవీకాలం ముగియడంతో కొత్త ఎండీ అవసరం వచ్చిపడింది.

రెండు పర్యాయాలు ఆయనకు పొడిగింపు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ మరో అవకాశం ఇవ్వలేదు. గడు వు తీరిపోవటంతో రమణారావు పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పూర్తిస్థాయి ఎండీ నియామకం జరిగే వరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.  

విఫల ప్రయోగం..
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఎండీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను నియమించటం ఆనవాయితీగా ఉండేది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి ఎండీ విషయంలో ప్రభుత్వం భిన్నంగా నాన్‌ కేడర్‌ అధికారిని నియమించింది. ఆ ప్రయోగం విఫలమవడంతో ఐపీఎస్‌ అధికా రినే ఎండీగా నియమించాలన్న డిమాండ్‌ పెరిగింది.

మరోవైపు రమణారావుకే అవకాశం ఇవ్వాలంటూ ఓ కార్మిక సంఘం తెరవెనుక ప్రయత్నం చేస్తున్న తరుణంలో మిగతా సంఘాలన్నీ ఏకమయ్యాయి. సరైన నాయకత్వం లేక ఆర్టీసీ నష్టాల పాలైందని, సమర్థుడైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని నియమించాలని ఆ సంఘాలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి.

అంతా అస్తవ్యస్తం..
ఆర్టీసీలో ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణారావును కేసీఆర్‌ ఎంపిక చేశారు. రమణారావు అనుభవం సంస్థకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఆయన్ను ఎండీగా నియమించినట్టు సీఎం తెలిపారు. కానీ ఫలితం దానికి భిన్నంగా కనిపించింది. ఆయనతో ఏ ఒక్క ఈడీ సఖ్యతగా పనిచేయలేదు.

వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగింది. కార్మిక సంఘాలు కూడా రమణారావు మాట లెక్క చేయలేదు. అధికారులు, కార్మిక సంఘాలు ఎండీని లెక్కచేయకపోవటంతో ఆర్టీ సీ అస్తవ్యస్తమైంది. ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణతో కూడా ఎండీకి పొసగలేదు. కొంత కాలంగా చైర్మన్‌ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

కేడర్‌ అధికారి వస్తేనే..
ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దాలంటే చైర్మన్, అధికారులు, సిబ్బంది, కార్మికులు.. ఇలా అందరినీ కలుపుకుపోవటంతోపాటు డైనమిక్‌గా పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. నష్టాలు తగ్గి ఆదాయం పెరగాలంటే అధికారులు, కార్మికులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. సీనియర్‌ ఐఏఎస్‌గానీ, ఐపీఎస్‌గానీ ఎండీగా రావాల్సిన అవసరం ఉంది. గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసి దాన్ని గాడిలో పెట్టిన ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పేరును ఎక్కువ మంది ప్రతిపాదిస్తున్నారు.  


రేసులో ఐదుగురు ఐపీఎస్‌లు
ఆర్టీసీ ఎండీగా సమర్థమైన అధికారి కావాలని, ఇందుకు ఐపీఎస్‌ అధికారుల్లో సీనియర్‌ అధికారిని గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంటెలిజెన్స్‌ విభాగానికి ఆదేశాలందాయి. దీంతో రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్‌ అధికారులపై ఇంటెలిజెన్స్‌ విభాగం నివేదిక రూపొందిస్తోంది. గతంలో ఆర్టీసీ ఎండీగా డీజీపీ హోదా లేదా అదనపు డీజీ హోదా ఉన్న ఐపీఎస్‌లు పనిచేశారు.

ఇప్పుడు కూడా డీజీపీ లేదా అదనపు డీజీపీలతోపాటు సీనియర్‌ ఐజీల పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్ర పోలీస్‌ శాఖలో డీజీపీ హోదాలో పనిచేస్తున్న 1986 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌ త్రివేది పేరు ప్రముఖంగా ఉన్నట్టు తెలిసింది.  అదే బ్యాచ్‌కు చెందిన కృష్ణ ప్రసాద్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. ఇక అదనపు డీజీపీల నుంచి అగ్నిమాపక శాఖ డైరెక్ట ర్‌ జనరల్‌ గోపీకృష్ణ(1987 బ్యాచ్‌), ఆర్గనైజేషన్‌ అదనపు డీజీ రాజీవ్‌ రతన్‌(1991 బ్యాచ్‌) పేర్లు వినిపిస్తున్నాయి.

సీనియర్‌ ఐజీలను కూడా ఇంటెలిజెన్స్‌  పరిశీలనలో చేర్చినట్టు తెలుస్తోంది. గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి, సీనియర్‌ ఐజీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌(1995 బ్యాచ్‌) పేరు కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, సీనియర్‌ సెక్రటరీ హోదాలో ఉన్న ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు పోటీ పడుతున్నట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు