ఇక పాలి‘టెక్‌’లు!

19 Jul, 2018 01:25 IST|Sakshi

ఇంజనీరింగ్‌ కాలేజీలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల అభివృద్ధి 

సాంకేతిక విద్యా శాఖ కసరత్తు

పాలిటెక్నిక్‌లలో ఆరు నెలలకుపైగా ఇంటర్న్‌షిప్‌ 

ఈ ఏడాది నుంచే అమలుకు చర్యలు 

సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు 198 ఉంటే ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీలు 14 మాత్రమే ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో లక్షకు పైగా సీట్లు ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 3 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్‌ కాలేజీలు అవసరమని సాంకేతిక విద్యా శాఖ భావిస్తోంది. తగిన మౌలిక సదుపాయాలు, భవనాలు కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలను ఇంజనీరింగ్‌ కాలేజీలుగా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఆ దిశగా ప్రభుత్వంతో చర్చించి, తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ బుధవారం వెల్లడించారు. ప్రభుత్వ స్థాయిలో దీనిపై చర్చ జరిగాకే నిర్ణయాలు ఉంటాయని ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యం లోని ఇంజనీరింగ్‌ కాలేజీల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టడం ద్వారా మరింత మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవచ్చని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఏయే పాలిటెక్నిక్‌ కాలేజీలు అనువుగా ఉంటాయన్న అంశంపై అధికారులతో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. 

ఉపాధి అవకాశాలు పెంచేలా.. 
పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడంతోపాటు విద్యావకాశాలను పెంపొందించేందుకు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 2018–19లో పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం నుంచే ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసేందుకు నిర్ణయించింది. పరిశ్రమలతో అనుసంధానం చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాల నుంచి విద్యార్థులకు ఆఫర్లు వచ్చేలా చేయడంతోపా టు ఇంటర్న్‌షిప్‌ ద్వారా పరిశ్రమల్లో ఎక్కువ కాలం పని చేస్తే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచవచ్చన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఆరు నెలలకుపైగా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేయనుంది. మొదటి సంవత్సరం అయ్యాక వేసవి సెలవుల్లో 6 నుంచి 8 వారాలు, ద్వితీయ సంవత్సరం పూర్తయ్యాక వేసవి సెలవుల్లో 6 నుంచి 8 వారాలు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది.  ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు చివరి సెమిస్టర్‌ మొత్తం (దాదాపు 110 రోజులు) ఇంటర్న్‌షిప్‌ చేసేలా చర్యలు చేపట్టింది. చివరి సెమిస్టర్‌ ఇంటర్న్‌షిప్‌ను ఆప్షనల్‌గా అమలు చేయాలని నిర్ణయించింది. 

పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌.. 
పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయ్యాక ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో చేరాలనుకునే వారు (ఈసెట్‌ రాసి ల్యాటరల్‌ ఎంట్రీ ద్వారా) కాలేజీలో చదువుకుంటూనే ప్రాజెక్టు వర్క్‌ చేసేలా ఆప్షన్‌ ఇచ్చింది. పాలిటెక్నిక్‌ తర్వాత ఉపాధి అవకాశాలు వెతుక్కునే విద్యార్థులు చివరి సెమిస్టర్‌ మొత్తం పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తద్వారా విద్యార్థులకు ఆయా కంపెనీల్లో ఉపాధి లభించే అవకాశం ఉంటుందని నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం, తృతీయ సంవత్సరం చదివే విద్యార్థుల నుంచి ఇంటర్న్‌షిప్‌ చేసే అంశంపై ముందుగానే ఆప్షన్‌ తీసుకోవాలని కాలేజీలను ఆదేశించారు. మరోవైపు కొత్త సిలబస్‌ ప్రకారం ఇంజనీరింగ్‌లోనూ ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. 

డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్‌.. 
డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్‌ తెచ్చినట్లు నవీన్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. దీన్ని అన్ని కాలేజీలు అమలు చేయడం లేదని, విద్యార్థులకు ఆప్షన్‌గా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎంపిక చేసిన కోర్సుల్లో ఇంట ర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసే అవకాశం ఉందని చెప్పా రు. ప్రస్తుతం డిగ్రీ ప్రథమ, ద్వితీయ ఏడాదిలో 2 క్రెడిట్ల చొప్పున ఇంటర్న్‌షిప్‌ చేసే వారికి 4 క్రెడిట్లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు