పాత్రికేయులు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు 

3 May, 2020 03:55 IST|Sakshi

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 సంక్షోభంలో పాత్రికేయులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కచ్చితమైన సమాచారాన్ని అందించడంతో పాటు ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కొనియాడారు. ‘వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం డే’సందర్భంగా పాత్రికేయ లోకానికి గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నిష్పాక్షికంగా తమ విధులు నిర్వర్తిస్తూ దేశ నిర్మాణంలో పాత్రికేయులు కీలక భూమిక పోషించాలని, ప్రభుత్వానికి ప్రజలకు నడుమ అనుసంధాన కర్తలుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. భయం, పక్షపాతం లేకుండా పాత్రికేయులు తమ విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా గవర్నర్‌ ఆకాంక్షించారు.

స్వచ్ఛందంగా సేవలు అందించండి: స్వచ్ఛంద సంఘాలు, సంస్థలు, వ్యక్తులు పేదలకు అవసరమైన శానిటరీ కిట్లతో పాటు నిత్యావసరాలు అందజేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. శనివారం రాజ్‌భవన్‌లోని నాలుగో తరగతి మహిళా ఉద్యోగులకు శానిటరీ కిట్లు, ఆహార పొట్లాలను ఆమె పంపిణీ చేశారు. కోవిడ్‌ సహృదయ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ జి.అనూహ్యరెడ్డి వీటిని సమకూర్చినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు