గ్రీన్‌ ట్రిబ్యునల్‌ స్టే తాత్కాలికమే

6 Oct, 2017 00:53 IST|Sakshi

భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

సుప్రీంకోర్టులో న్యాయం లభిస్తుందని ఆశాభావం

ప్రాజెక్టును అడ్డుకున్న పైశాచిక ఆనందంలో కాంగ్రెస్‌

సాక్షి, యాదాద్రి/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) స్టే తాత్కాలిక అడ్డంకి మాత్రమేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఆయన నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్జీటీ స్టే ఇవ్వడంతో కాంగ్రెస్‌ పైశాచిక ఆనందం అనుభవిస్తోందని విమర్శించారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్న దశలో కాంగ్రెస్‌ కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీళ్లు ఇవ్వాలని మిషన్‌ భగీరథ చేపట్టామని, ఇందులో కాళేశ్వరం అత్యంత ప్రాధాన్యత కలిగిందన్నారు. కుళ్లు రాజకీయాలతో కాంగ్రెస్‌ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ భూతం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని ప్రభుత్వం చేపట్టిన డిండి ప్రాజెక్టునూ కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నేరుగా నష్టపరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెండింగ్‌ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ.. రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జనవరిలో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులోకి నీళ్లు వదులుతామని హామీ ఇచ్చారు.

నెల రోజుల్లో మార్కెట్‌ నిర్మాణం
నల్లగొండ జిల్లాలో చేపట్టిన బత్తాయి మార్కెట్‌ నిర్మాణాన్ని నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అలాగే దొండ, నిమ్మ మార్కెట్ల నిర్మాణాన్ని రెండు, మూడు మాసాల్లో పూర్తి చేస్తామన్నారు. నాడు తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎం... ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటోందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో తెలంగాణలో సీపీఎంకు స్థానం లేదన్నారు. రాష్ట్రంలో సీపీఎంకు ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు ఉందని, అది కూడా త్వరలోనే ఖాళీ అవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ, భువనగిరి ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, జడ్పీ చైర్మన్‌ బాలునాయక్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

24 గంటలు వద్దు.. 12 గంటలు ముద్దు
నల్లగొండలో 24 గంటల విద్యుత్‌పై హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సమయంలో కట్టంగూరు మండలం ఈదులూరుకు చెందిన రాములు అనే రైతు లేచి 24 గంటల విద్యుత్‌ వద్దని 9 గంటలు చాలని అన్నాడు. దీంతో మంత్రి జోక్యం చేసుకుని 24 గంటల విద్యుత్‌ ఎందుకు వద్దుంటున్నావ్‌..? అని అడిగారు. నీళ్లు సరిపోవడం లేదని, బోర్లులో నీళ్లు ఉండటం లేదని 9 గంటలు ఇస్తే చాలని రాములు చెప్పాడు. రాములు వ్యక్తం చేసిన అభిప్రాయం పైన మంత్రి అభిప్రాయ సేకరణ చేశారు. రాములుకు మద్ధతుగా చేతులు ఎత్తాలని మంత్రి కోరారు. దీంతో సభకు హాజరైన వారిలో కొందరు 9 గంటలు కావాలని, మరికొందరు 12 గంటలు ఇవ్వాలని కోరారు. మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు