'భూగర్భ' శోకమే

14 Dec, 2017 01:26 IST|Sakshi

24 గంటల విద్యుత్‌తో భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి

నిరంతర విద్యుత్‌తో 3 రెట్లు పెరగనున్న నీటి వినియోగం

భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయే ప్రమాదం

దీంతో ఆటోస్టార్టర్లు తొలగించాలంటున్న ప్రభుత్వం

కరెంట్‌ పోయిన ప్రతిసారీ మోటార్‌ ఆన్‌ చేయాలంటే ఎలా అంటున్న రైతులు

‘రిమోట్‌’ వ్యవస్థలే ప్రత్యామ్నాయమంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటికే భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువ. చాలా మంది రైతులు బోర్లు, బావులపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు. రోజుకు సుమారు 8 గంటలపాటు బోర్లు నడుస్తున్నాయని కేంద్ర అధ్యయనం కూడా నిర్ధారించింది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సాగుకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వనుండటంతో.. భూగర్భ జలాల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిరంతర విద్యుత్‌ కారణంగా భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే రైతులు ఆటోస్టార్టర్లను తొలగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవిస్తోందని... ఇది క్షేత్రస్థాయిలో ఏ మేరకు ఫలితమిస్తోందన్న దానిపై భూగర్భ జలాల పరిస్థితి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

ఎక్కువశాతం సాగు బోర్లు, బావులతోనే..
తక్కువ వర్షపాతం, కాల్వల వంటి ఉపరితల నీటి సరఫరా అవకాశం పెద్దగా లేకపోవడంతో రాష్ట్రంలో పంటల సాగు ఎక్కువగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14.5 లక్షల బోర్లు, బావులుండగా... ఏకంగా 28 లక్షల నుంచి 30 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. 2012–13 భూగర్భ జల వనరుల అంచనా ప్రకారం.. భూగర్భ జలాల లభ్యత 469 టీఎంసీల మేర ఉండగా, వినియోగం 271 టీఎంసీల వరకు ఉంటోంది. ఇది ఏటా ఆ ఏడాది కురిసే వర్షపాతానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుత ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో 12 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జల మట్టాలు మరింత లోతుకు వెళ్లిపోయాయి. గతేడాది నవంబర్‌లో భూగర్భ జలాలు సగటున 7.76 మీటర్ల దిగువన ఉండగా.. ఇప్పుడు 8.36 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే సగటున 0.6 మీటర్లు దిగువకు వెళ్లిపోయాయి. అదే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర జిల్లాల్లోనైతే ఏకంగా 5.10 మీటర్ల దాకా పడిపోయాయి.

రబీలో మరింతగా..
సాధారణంగా ఏటా డిసెంబర్‌ నాటికి సగటున 10 మీటర్లలోతులో ఉండే భూగర్భ జలాలు.. ఏప్రిల్, మే నాటికి 16 నుంచి 22 మీటర్ల వరకు పడిపోతాయి. రబీలో వేసవి తీవ్రతకు ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి లభ్యత తగ్గిపోయి రైతులు భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు. 4 నుంచి 8 గంటల పాటు బోర్లను నడుపుతున్నారు. దాంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతుంటాయి. అదే 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తే.. భూగర్భ జలాలు మరింతగా క్షీణించే అవకాశముందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ‘‘రాష్ట్రంలో ఒక మంచి బోరు గంటకు 5 వేల లీటర్లను లాగుతుంది. 8 గంటలు నిరంతరాయంగా నడిస్తే 40 వేల లీటర్లు లాగుతుంది. అదే 24 గంటల పాటు నడిస్తే.. మూడు రెట్ల అధిక భూగర్భ జలాలు తోడేస్తుంది. ఇది భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల భూగర్భ జల మట్టాలు 25 నుంచి 30 మీటర్లకు పడిపోయినా ఆశ్చర్యం లేదు..’’ అని పేర్కొంటున్నారు.

భూమిని తోడేస్తున్నారు!
కేంద్ర జల వనరుల శాఖ దేశవ్యాప్తంగా చిన్న నీటి వనరుల ద్వారా నీటి వినియోగంపై అధ్యయనం చేసింది. తెలంగాణలో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉందని.. పెద్ద సంఖ్యలో లోతైన బోర్లు వేస్తున్నారని అందులో తేల్చింది. రాష్ట్రంలో 2013–14 నాటికి ఉన్న సుమారు 2.70 లక్షల లోతైన బోరుబావులను పరిశీలించింది. దాదాపు 20,321 బోర్లు పనిచేయడం లేదని గుర్తించింది. మరో 2,50,313 బోర్ల పరిస్థితి, మోటార్ల పనితీరు, వినియోగిస్తున్న విద్యుత్, తోడేస్తున్న నీరు తదితర అంశాలను పరిశీలించింది. రాష్ట్రంలో బోర్లను 4 నుంచి 8 గంటల పాటు నడుపుతున్నట్లు తేల్చింది.
– ఖరీఫ్‌ సీజన్‌లో సర్వే చేసిన 2.50 లక్షల బోర్లలో 2.30 లక్షల బోర్లను 4 నుంచి 8 గంటల పాటు నడిపారు. 17,685 బోర్లను మాత్రం నాలుగు గంటల కన్నా తక్కువ సమయం పాటు నడిపారు.
– రబీ సీజన్‌లోనూ 2.19 లక్షల బోర్లను నాలుగు నుంచి 8 గంటల పాటు నడిపారు.
– 2.23 లక్షల బోర్లకు ఒకటి నుంచి 6 హెచ్‌పీ (హార్స్‌ పవర్‌) సామర్థ్యమున్న మోటార్లను వినియోగించగా.. 25,909 బోర్లకు 6–12 హెచ్‌పీ మోటార్లను వాడారు.
– 2.50 లక్షల బోర్లలో ఖరీఫ్‌ సీజన్‌లో 17,265 మోటార్లను వెయ్యి గంటలకుపైగా నడపగా.. 36 వేల మోటార్లను 800 నుంచి వెయ్యి గంటల పాటు, 89 వేల మోటార్లను 600 నుంచి 800 గంటల వరకు నడిపినట్లుగా గుర్తించారు.
– దేశవ్యాప్తంగా చూస్తే అధిక సమయం మోటార్లను నడుపుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది.

ఆటోస్టార్టర్లు తొలగించకుంటే అంతే..
రాష్ట్రంలో చాలా ఏళ్లపాటు కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. దాంతో రైతులంతా వ్యవసాయ బోర్లకు ఆటోస్టార్టర్లు పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చాక కరెంటు పరిస్థితి మెరుగుపడినా.. భూగర్భ జలాలు తక్కువగా ఉండడం, నీరు సన్నగా వస్తుండడంతో విద్యుత్‌ సరఫరా ఉన్నంతసేపూ బోర్లు నడిచేందుకు ఆటోస్టార్టర్లు అలాగే ఉంచేశారు. ఇప్పుడు ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ ఇవ్వనున్న నేపథ్యంలో.. ఆటోస్టార్టర్లతో కొత్త సమస్య వచ్చి పడుతోంది. వాటివల్ల బోర్లు నిరంతరాయంగా నడుస్తూనే ఉంటాయి. దీంతో ఎక్కువ నీటిని తోడేస్తే.. భూగర్భ జలాలకు నష్టం వాటిల్లక తప్పని పరిస్థితి ఉండనుంది. ఇది చివరికి బోర్లలో నీరురాక పంటలు ఎండిపోయే దుస్థితికి దారి తీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆటోస్టార్టర్లు తొలగించాల్సిందిగా రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

ఆటోస్టార్టర్లకు ప్రత్యామ్నాయం చూపాలి
‘‘24 గంటల విద్యుత్‌తో భూగర్భంపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నది సుస్పష్టం. దీనికి విరుగుడుగా ప్రభుత్వం ఆటోస్టార్టర్లను తొలగించాలని అంటోంది. మరి ఆటోస్టార్టర్లను తొలగించాక.. కరెంటు పోయి రావడం వంటి ఏదైనా సమస్య వస్తే బోరు ఆగిపోతుంది. తిరిగి మోటార్‌ ఆన్‌ చేయాలంటే ఎలా? రైతులు ప్రతిసారి కరెంటును, మోటార్‌ను కనిపెట్టుకుని కూర్చోవాలా? అన్న ప్రశ్న వస్తుంది. అందువల్ల ఆటోస్టార్టర్లకు ప్రత్యామ్నాయం చూపాలి. బోరు మోటార్లను రిమోట్‌ వ్యవస్థల ద్వారా ఆన్‌/ఆఫ్‌ చేసే ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల రైతులకు ఉపశమనం ఉంటుంది. నీటి వృథా తగ్గి, భూగర్భానికి నష్టం ఉండదు..’’  – శ్యాంప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం

జలాలను విపరీతంగా తోడేసిన నోటిఫైడ్‌ గ్రామాలు
సంవత్సరం    గ్రామాల సంఖ్య
2002–03    572
2010–11    1,055
2017–18    1,358
– అధికంగా సిద్ధిపేట జిల్లాలో 175 గ్రామాలు ఈ జాబితాలో ఉండగా.. రంగారెడ్డి 120, జగిత్యాల 116, నాగర్‌ కర్నూల్‌ 97 గ్రామాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
– ఈ గ్రామాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. వ్యవసాయం కోసం లోతైన బోర్లు వేసి నీటిని తోడేయడమే దీనికి కారణం.

>
మరిన్ని వార్తలు