మహేశ్‌బాబు బాకీ వసూలు 

30 Dec, 2018 01:42 IST|Sakshi

మహేశ్‌బాబు ఖాతాలోని రూ.31.47లక్షలు ఖజానాకు జమ 

ప్రభుత్వ ఖజానాకు డీడీ రూపంలో ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు 

జీఎస్టీ కమిషనరేట్‌ వర్గాల వెల్లడి 

హైకోర్టు కూడా స్టే ఇవ్వనందునే చర్యలు తీసుకున్నామని ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: సినీనటుడు మహేశ్‌బాబు చెల్లించాల్సిన పన్ను మొత్తం వసూలైంది. జీఎస్టీ కింద కట్టాల్సిన రూ.73లక్షల పైచిలుకు మొత్తంలో రూ.42లక్షలను గురువారమే రికవరీ చేయగా, తాజాగా జీఎస్టీ కమిషనరేట్‌ సీజ్‌ చేసిన అకౌంట్‌లోని రూ.31.47లక్షలను ఐసీఐసీఐ బ్యాంకు ప్రభుత్వ ఖజానాకు జమచేసింది. ఈ మొత్తాన్ని డీడీ రూపంలో గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచ్‌కు శనివారం జమ చేసినట్టు జీఎస్టీ కమిషనరేట్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో మహేశ్‌బాబు చెల్లించాల్సిన మొత్తం పన్ను జమ అయిందని తెలిపాయి.  

అథారిటీలు ఒప్పుకోలేదు 
అయితే, తాను చెల్లించాల్సిన పన్నుకు సంబంధించి మహేశ్‌బాబు చేసుకున్న అప్పీళ్లను రెండు స్థాయిల్లోని అథారిటీలు తిరస్కరించడంతోపాటుగా పన్ను మొత్తాన్ని కట్టాలని ఆదేశించాయని జీఎస్టీ కమిషనరేట్‌ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆయన ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఇప్పటివరకు కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని, అందుకే తాము చర్యలకు దిగాల్సి వచ్చిందని తెలిపాయి. ఈ పన్ను చెల్లింపునకు సంబంధించి ఆయనకు 2010లోనే నోటీసులిచ్చినట్టు తెలిపాయి. వస్తువుల అమ్మకాలను ప్రోత్సహించే ప్రకటనల సర్వీసులు కూడా బిజినెస్‌ ఆక్సిలరీ సర్వీసెస్‌ కింద పన్ను చెల్లింపు కిందకు వస్తాయని చట్టం చెబుతోందని తెలిపాయి. 

>
మరిన్ని వార్తలు