‘ఆయనకు అవార్డు వస్తే మీకెందుకు మంట’

31 Aug, 2017 20:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నిన పార్టీగా త్వరలోనే కాంగ్రెస్‌కు అవార్డు దక్కుతుందని, అయినా కేసీఆర్‌కు అవార్డు వస్తే ఎందుకంత కడుపు మంట అని విద్యుత్‌ శాఖ మంత్రి జి. జగదీష్‌ రెడ్డి ప్రశ్నించారు. పోరాడటానికి ప్రజా సమస్యలేవీ లేక కాంగ్రెస్‌ నేతలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. వారం రోజులుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడంపై చేస్తున్న విమర్శలు హుందాగా లేవన్నారు. అరవై ఏళ్లుగా రైతులపై మొసలి కన్నీళ్లు కార్చడం తప్ప కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని, గతంలో ఇలాంటి అవార్డు ఆ పార్టీ సీఎంలకు ఎవరికైనా వచ్చిందా అని నిలదీశారు. అవార్డులు భవిష్యత్‌లో కూడా రావని, ఆ పార్టీ అదృశ్యం కావడం ఖాయమన్నారు. ఈ అవార్డుతోనే తాము తృప్తి చెందడం లేదని, త్వరలో ప్రజలే అవార్డు ఇవ్వబోతున్నారని తెలిపారు.

వచ్చే ఎన్నికల తర్వాత మాట్లాడేందుకు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌కు ఉండరని జోస్యం చెప్పారు. ఎన్ని వందల కేసులు వేసినా కేసీఆర్‌ సంకల్పాన్ని దెబ్బతీయ లేరని, ఉత్తమ్ వంటి నేతలకు బియ్యం ఎలా వస్తాయో తెలుసా అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి పోయేంత తెలివితక్కువ వాళ్ళు ఎవరూ లేరని, కాంగ్రెస్‌లోకి వలసలుంటాయని చెబుతున్నాయన ఆ పార్టీలో ఉంటారా అని వ్యాఖ్యానించారు. రైతు సమన్వయ సమితిలపై అఖిల పక్షం పెట్టాల్సిన అవసరం లేదని, వ్యవసాయంపై ప్రతిపక్షాలకు అవగాహన ఉంటే కదా వారి సలహాలు తీసుకునేది అని అన్నారు.

మరిన్ని వార్తలు