15 నుంచి హజ్‌ దరఖాస్తులు

14 Nov, 2017 02:55 IST|Sakshi

2018 షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర హజ్‌ కమిటీ

ఎస్‌ఏ షుకూర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: హజ్‌ 2018 షెడ్యూల్‌ను కేంద్ర హజ్‌ కమిటీ విడుదల చేసిందని, ఈ నెల 15 నుంచి డిసెంబర్‌ 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర కోసం దరఖాస్తుల పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్‌హౌస్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదికి కేంద్ర హజ్‌ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. రాష్ట్ర కమిటీ కార్యాచరణ రూపొందించిందన్నారు. అన్ని జిల్లాల్లో ఒకే రోజు హజ్‌ దరఖాస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. 15న డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ చేతుల మీదుగా దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈసారి కేంద్ర హజ్‌ కమిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు.

దరఖాస్తు ఫారం పూర్తి చేసి.. రూ.300ల స్టేట్‌ బ్యాంక్‌ లేదా యూనియన్‌ బ్యాంక్‌ ద్వారా చలాన్‌ తీయాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు జిరాక్స్, బ్యాంక్‌ పాస్‌బుక్, ఆదార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జిరాక్స్‌ జమచేయాలన్నారు. గ్రీన్, అజీజియా.. రెండు కేటగిరీలు ఉన్నాయని, దరఖాస్తులో కేటగిరీని నమోదు చేయాలని సూచించారు. గత మూడేళ్లకు ముందు హజ్‌ లేదా ఉమ్రాకు వెళ్లి వచ్చిన వారు తిరిగి హజ్‌ యాత్రికుడితో సహాయకుడిగా వెళ్తే యాత్రకయ్యే ఖర్చులతో పాటు అదనంగా 2 వేల సౌదీ రియాల్‌ జమ చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర హజ్‌ షెడ్యూల్‌ ప్రకారం హజ్‌ యాత్రికుల ఎంపిక ప్రక్రియకు జనవరిలో డ్రా ఉంటుందన్నారు. జూలై 11 నుంచి హజ్‌ యాత్ర ప్రారంభమౌతుందన్నారు. హజ్‌ ఆరాధన 2019 ఆగస్టు 8న ఉంటుందన్నారు. హజ్‌ కొత్త పాలసీ విధివిధానాలు తేలియజేయడానికి నేడు అన్ని జిల్లాల కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. 

కొత్త హజ్‌ పాలసీపై అసంతృప్తి
ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర హజ్‌ కమిటీ విడుదల చేసిన హజ్‌ పాలసీపై ముస్లింలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హజ్‌ యాత్రలో కేంద్రం జోక్యాన్ని ముస్లిం ధార్మిక సంస్థలు తప్పుపడుతున్నారు. హజ్‌ యాత్ర కోసం గత మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్నవారు నాల్గవసారి దరఖాస్తు చేసుకుంటే నేరుగా యాత్రకు అవకాశం ఉండేది. ఈసారి ఈ కేటగిరీని రద్దు చేయడంపై యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇస్లామియా ధర్మశాస్తం ప్రకారం.. ఏ మహిళ కూడా ఒంటరిగా ప్రయాణం చేయకూడదని, దాన్ని పరిగణనలో తీసుకోకుండా కేంద్రం 45 ఏళ్ల వయస్సు పైబడిన మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవచ్చనడం సరికాదన్నారు. 

>
మరిన్ని వార్తలు