రాజయ్యా.. ఇటు చూడయ్యా..

5 Oct, 2014 02:08 IST|Sakshi

అస్తవ్యస్తంగా వైద్యసేవలు
గాడితప్పిన జిల్లా ఆస్పత్రి


నిజామాబాద్ అర్బన్ : ఏడంతస్తుల అద్దాల మేడ సైతం అసౌకర్యాల నిలయంగా మారింది. జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులకు నామమాత్రపు వైద్య సేవలే అందుతున్నాయి. ఆస్పత్రి పాలన పడకేసింది. చక్కబెట్టేందుకు చొరవ తీసుకునే మంత్రులు కాని, ప్రజాప్రతినిధులు కాని లేరు. దీంతో వైద్యం అందక పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య సైతం జిల్లాలో వైద్య సేవలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి జిల్లావైపు కన్నెత్తి చూడలేదు. మంత్రి జిల్లాలో వైద్య సేవలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

పోస్టులు ఖాళీ..

జిల్లాలో 44 ప్రాథమిక  ఆరోగ్య కేంద్రాలు, 375 ఉప కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి, 10 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో 118 స్టాఫ్‌నర్సులు, 78 మంది ల్యాబ్‌టెక్నిషియన్‌లు, 36 మంది ఫార్మసిస్టులు, 22 మంది వైద్యులు, 84 ఏఎన్‌ఎంల అవసరం ఉంది. ఈ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల క్షేత్రస్థాయి వైద్యసేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పోస్టుల భర్తీపై ప్రభుత్వంనుంచి ఎలాంటి స్పష్టత లేదు. అలాగే ఆస్పత్రుల్లో పరిపాలన సైతం బాగా లేదు. వైద్యలు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. సూపర్‌వైజర్లు, వైద్యులు రెండు మూడు గంటలు మాత్రమే అందుబాటులో ఉండి వెళ్లిపోతున్నారన్న విమర్శలున్నాయి. మరికొందరు వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసులో మునిగి తేలుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అస్తవ్యస్తంగా తయ్యారయ్యాయి.

మెడికల్ కళాశాలలో నియమితులైన ప్రొఫెసర్ల లో 36 మంది హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. వారు ఆస్పత్రికి రాకుండానే, వైద్యసేవలు అందించకుండానే వేతనాలు పొందుతున్నారు. మరోవైపు దీని అనుబంధ ఆస్పత్రిలో 280 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించి 150 జీవో విడుదలయ్యింది కానీ నియామకాలు లేకపోవడంతో ఆస్పత్రిలో ఖాళీల కొరత వల్ల వైద్యసేవలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. నేటికీ జిల్లా ఆస్పత్రిని ఎక్కడికి తరలించాలి అన్న నిర్ణయమే తీసుకోలేదు. ఆ కళాశాల, జిల్లా ఆస్పత్రి కలిసి ఉండడంతో వైద్యుల మధ్య విభేదాలు ఏర్పడి సేవలపై ప్రభావం పడుతోంది.
 
విజృంభిస్తున్న వ్యాధులు

జిల్లాలో పారిశుధ్యం అస్తవ్యస్తగా తయారయ్యింది. దీంతో వైద్యులు విజృంభిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే 50 వరకు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ముగ్గురు మరణించారు. డయేరియా-22,  మలేరియా-78, వైరల్‌ఫీవర్-150 కేసులు నమోదయ్యాయి. వ్యాధుల అదుపునకు వైద్యాధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే అన్న విమర్శలున్నాయి. జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నా అధికారులతోపాటు ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య శాఖ మంత్రి జిల్లాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు