రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు!

13 Jun, 2015 03:01 IST|Sakshi
రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు!

చంద్రబాబుపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా, అక్కడ పాలమూరు కూలీలు ఉంటారు. కానీ పాలమూరుకు మాత్రం ప్రాజెక్టు లేదు. వారికోసం ఒక ప్రాజెక్టు కడదాం అనుకుంటే అడ్డు పడుతున్నారు. మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టును కూడా అడ్డుకుంటున్న ఒకే ఒక్క నేత చంద్రబాబు, ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం’.. అని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఇంకా ఆధిపత్య ధోరణి కొనసాగిస్తున్నారని విమర్శించారు. ‘శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తే అడ్డుకున్నారు. ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్‌లకు తాగునీరు ఇస్తామంటే అడ్డుపడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనే డిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారని వివరించారు.

2007లోనే అప్పటి  సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే పాలమూరు ఎత్తిపోతలకు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఏపీ వ్యవహారంపై చంద్రబాబును నిలదీయాలన్నారు. పాలమూరు ప్రాజెక్టును కట్టాలంటారా? వద్దంటారో తెలంగాణ టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. డిండి, పాలమూరు ప్రాజెక్టులు నిర్మించడానికి అన్ని  హక్కులు ఉన్నాయని, పనులు మొదలు పెట్టాక అన్ని అనుమతులూ తెచ్చుకుంటామన్నారు.

>
మరిన్ని వార్తలు