16 సీట్లు గెలిస్తే ఢిల్లీ మన చేతిలోనే

24 Mar, 2019 02:15 IST|Sakshi

కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు

సాక్షి, సంగారెడ్డి: ‘రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిపిస్తే..ఢిల్లీ మన చేతుల్లో ఉంటుంది. మనమే నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తాం’అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా శనివారం ఇక్కడ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే కేవలం సంగారెడ్డిలోనే స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యామని, ఈ ఎన్నికల్లో కనీసం 20 నుంచి 30 వేల మెజారిటీ ఈ సెగ్మెంట్‌ నుంచి తీసుకురావడానికి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో భవిష్యత్‌ లేదని, అందువల్లనే ఆపార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి రోజుకొకరు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నా రు.

ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విధంగా సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క మంచిపని కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ లాంటి దేశం మెచ్చిన పథకాలకు ఒక్క పైసా నిధులు కేంద్రం ఇవ్వలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి  మాట్లాడుతూ సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌కు నిత్యం వందలాది మంది ప్రయాణిస్తున్నారని, వీరి కోసం ఎంఎంటీఎస్‌ రైలు ను పొడిగించే విధంగా కృషి చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు