‘తెలంగాణ జాతర అంటేనే మల్లన్న జాతర’

22 Dec, 2019 20:25 IST|Sakshi

సాక్షి సిద్దిపేట: పట్నం, బోనం అంటేనే మల్లన్న జాతర గుర్తుకు వస్తుందని.. మల్లన్న, కొండపోచమ్మను పూజిస్తే అందరూ చల్లగా ఉంటారని మంత్రి హరీష్‌రావు అన్నారు. వీరశైవ ఆగమన శాస్త్ర సంప్రదాయం ప్రకారం శ్రీమల్లికార్జున స్వామికి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల కల్యాణ మహోత్సవ వేడుకలో హరీష్‌రావు ఆదివారం పాల్గొన్నారు.​ కొమురవెల్లి మల్లన్న కల్యాణంలో స్వామివారికి హరీష్‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న కల్యాణం అత్యంత వైభవంగా జరిగిందని  తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఆలయానికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ జాతర అంటేనే మల్లన్న జాతర అని.. మల్లన్న దయవల్ల ఈ ప్రాంతం కరువు పోయి సస్యశ్యామలం అయిందని ఆయన పేర్కొన్నారు. మద్దూర్, చేర్యాల, కొమురవేల్లి, నంగునూరు మండలాల్లో కరువు ఉండేదని.. మల్లన్న దయతో గోదావరి జలాలతో కరువు తోలిగిపోయిందన్నారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్‌లు శ్రీమల్లికార్జున స్వామి దయతో పూర్తయ్యాయని మంత్రి హరీష్‌ తెలిపారు.

మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌లు మల్లన్న దేవుని దయతో పూరై.. గోదావరి జలాలు కాళేశ్వరం లింగం వద్ద అభిషేకం చేసుకొని మల్లన్న పాదాలను తాకి మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌ను చేరాలన్నారు. మల్లన్న సాగర్ పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు రెండు పంటలు పండించుకోవచ్చని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు. పంట, పాడి పశువులు కాపాడే దేవుడు మల్లన్న దేవుడు అని.. మల్లన్న ఆలయంలో రూ. 30 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని హరీష్‌ తెలిపారు. వేడుకలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు