నేడు పలుచోట్ల భారీ వర్షాలు 

23 Jun, 2019 02:26 IST|Sakshi

ఈ నెలలో ఇప్పటివరకు 44 శాతం లోటు వర్షపాతం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రుతుపవనాల కారణంగా ఆదివారం పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా గాంధారిలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అదే జిల్లా ఎల్లారెడ్డిలో 8, బాన్సువాడలో 7, లింగంపేటలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇతర జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. 

ఇదిలావుండగా తెలంగాణలో జూన్‌ ఒకటో తేదీ నుంచి 22వ తేదీ వరకు 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అందులో నిర్మల్‌ జిల్లాలో అత్యంత ఎక్కువగా 78 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. జగిత్యాల జిల్లాలో మాత్రం 5 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. రుతుపవనాలు మొదలైన రోజు రంగారెడ్డి జిల్లాలో సాధారణం కంటే ఏకంగా 479 శాతం అధిక వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు