ఎత్తు.. పై ఎత్తు!

6 Jan, 2015 01:15 IST|Sakshi
ఎత్తు.. పై ఎత్తు!

‘భారీ’గా అన్నారం దర్గా టెండర్లు
ఏడాదికి రూ.1.10 కోట్లు..
గతేడాది ధర రూ.60 లక్షలు..
ఎమ్మెల్యే చెప్పినా కాంట్రాక్టర్ల దూకుడు
తగ్గించాలనుకుంటే పెరుగుదల
భక్తులపై భారం
 

వరంగల్ : మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న అన్నారం షరీఫ్ ‘హజ్రత్ యాకూబ్ వహీద రహమతుల్లా అలైహి’లో భక్తుల ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. అధిక మొత్తం చెల్లించి దర్గా నిర్వహణ టెండర్లు దక్కించుకోవడం.. ఆ తర్వాత భక్తులు అవస్థలు పడేలా వసూలు చేయడం ఇప్పట్లో ఆగేలా లేదు. ఏడాది కాలానికి సంబంధించి ఈ టెండర్లలో పోటాపోటీగా ఎక్కువ మొత్తం చెల్లించడం.. భక్తుల వద్ద ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లకు దిగడం ఇక్కడ సాధారణమైంది. ఇలా అడ్డగోలు వసూళ్ల కారణంగా అన్నారం దర్గాకు రావడానికి భక్తులు జంకుతున్నారు.

 ఎమ్మెల్యే చెప్పినా..

భక్తుల వ్యతిరేకతతో ఈ పరిస్థితిని మార్చేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ చర్యలు చేపట్టారు. సహేతుకమైన రీతిలో కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుని.. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. అన్నారం దర్గాలో భారీగా ఆదాయానికి అలవాటు పడిన కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే ఆదేశాలను ఖాతరు చేయలేదు. గతంలో కంటే రెట్టింపు మొత్తానికి టెండర్లు దక్కించుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టార్ల వ్యూహాల్లో చివరికి విషయం ముగింపు ఆసక్తి కలిగిస్తోంది. అన్నారం దర్గా నిర్వహణ టెండర్లు దక్కించునేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లు తీవ్రంగా పోటీ పడ్డారు. వీరిలో ఒకరు ఈ ఏడాది ఏకంగా రూ.1.10 కోట్లు చెల్లిస్తానని టెండరు దా ఖలు చేశారు. గతేడాది ఈ మొత్తం రూ.60 లక్షలే ఉంది. ఎమ్మెల్యే చెప్పిత తర్వాత కూడా గత ఏడాది కంటే రెట్టింపు స్థాయిలో మొత్తానికి టెండర్లు దాఖలు కావడంతో ఇప్పుడు వక్ఫ్‌బోర్డు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
 
భక్తులకు మళ్లీ అవస్థలే..


పర్వతగిరి మండలం అన్నారం దర్గా నిర్వహణ కోసం ఏటా టెండర్లు నిర్వహిస్తారు. 2014 డిసెంబరు 17 నుంచి 2015 డిసెంబరు 16 వరకు ఉన్న ఏడాది కాలానికి దర్గా నిర్వహణ కోసం గత నెల 8న రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. దర్గాకు వచ్చే భక్తులు కందూరు(మొక్కులు) రూపంలో చెల్లించే గొర్రెల చర్మము, తలకాయ-కాళ్లు, నజరో నియాజ్, హుండీలు, ఫాతెహ గొర్రెలు, ఫాతెహ వాహనం(పూజ), హెయిర్ కటింగ్, నాగులమెర పుట్ట, కొబ్బరి చిప్పల రూపంలో వచ్చే ఆదాయం తీసుకుని దర్గా నిర్వహణ జరపాలని పేర్కొంది. డిసెంబరు 15న టెండర్ల ప్రక్రియ జరిగింది. గతంలో కంటే తక్కువ ధరకు కోట్ చేయడంతో టెండర్లను వక్ఫ్‌బోర్డు అధికారులు డిసెంబరు 31కి వాయిదా వేశారు.

ఇదే అదనుగా అన్నారం దర్గా కాంట్రాక్టర్లు నాలుగు పేర్లతో వేర్వేరుగా టెండర్లు దాఖలు చేశారు. రూ.60 లక్షలు, రూ.72 లక్షలు, రూ.80 లక్షలు, రూ.1.10 కోట్ల చొప్పున మొత్తాలను కోట్ చేశారు. వీటిలో గరిష్టంగా ఉన్న మొత్తానికి వక్ఫ్‌బోర్డు కేటాయించే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే భారీ మొత్తాన్ని భక్తుల నుంచి రాబట్టేందుకు కాంట్రాక్టర్లు ఇప్పటి కంటే ఎక్కువగా భక్తులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి ఎమ్మెల్యే ప్రయత్నాలు ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి ఉండనుంది.
 
 

మరిన్ని వార్తలు