షాబాద్, శంషాబాద్, షాద్ నగర్లలో హై అలర్ట్

7 Apr, 2015 14:01 IST|Sakshi

వరుస ఉద్రిక్త పరిస్థితులతో తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఏక్షణం ఏం జరుగుతుందా అని సామాన్య జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడోగానీ తమకు వినిపించని పోలీసుల బూట్ల చప్పుళ్లు ఇప్పుడు ప్రతిక్షణం.. ప్రతిచోట వినిపిస్తున్నాయి. అదే సమయంలో దొంగలు, దోపిడీ దారులు, ఉగ్రవాదులు మొత్తానికి రాష్ట్రేతరులు క్రూరపు ఆలోచనలతో అలజడులు సృష్టిస్తుండగా ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. మంగళవారం ఉదయం వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్ అనంతరం తెలంగాణలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర గాలింపులు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తుపాకులతో కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో షాబాద్, శంషాబాద్, షాద్ నగర్లలో హై అలర్ట్ ప్రకటించారు. వరంగల్లో ఎన్కౌంటర్కు ముందు గుర్తు తెలియని దుండగులు తమపై దాడులు చేయడంతో అది ముందస్తూ వ్యూహంతోనే జరిగిందా? తాము వెళుతున్న మార్గంలోనే ఉగ్రవాదులు అనుసరిస్తున్నారా అనే అనుమానం కూడా పోలీసులకు కలుగుతోంది. మొత్తానికి సూర్యపేట ఘటన కావచ్చు.. చిత్తూరు ఘటన కావచ్చు.. పోలీసుల మాత్రం ప్రస్తుతం డేగ కళ్లతో పనిచేస్తున్నారని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు