సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేయండి

14 Jan, 2015 02:41 IST|Sakshi

హైకోర్టు ధర్మాసనం ముందు మాజీ డీజీపీ అరవిందరావు అప్పీల్.. తీర్పు వాయిదా

సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి సుందరకుమార్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేయాలంటూ మాజీ డీజీపీ అరవిందరావు హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిని న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ ఎస్.వి.భట్టీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు, దాస్ తరఫు న్యాయవాది వాద,  ప్రతివాదాలు విన్న ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... అసలు పిటిషన్‌లో ప్రతివాదిగా లేని వ్యక్తిపై, అతని వాదనలు వినకుండానే కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేయవచ్చా? అని ప్రశ్నించింది. తరువాత ఈ వ్యాజ్యంలో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

తను ఎస్సీని కావడంతో సరైన పోస్టింగ్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారంటూ అరవిందరావు అదనపు డీజీ(ఇంటెలిజెన్స్)గా ఉన్నప్పుడు దాస్ ఆయనపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని ఆయన హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు.. వాదనల అనంతరం దాస్ ఫిర్యాదు ఆధారంగా అరవిందరావుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలివ్వడం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు