కుంభకర్ణ నిద్రలో ఉన్నారా..?

20 Sep, 2018 01:49 IST|Sakshi

డీఈఈ సెట్‌ కన్వీనర్‌పై హైకోర్టు ఆగ్రహం 

లక్ష జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలంటూ నోటీసులు

సాక్షి,హైదరాబాద్‌: వృత్తివిద్య పూర్తి చేసిన ఒక విద్యార్థికి డీఈఈడీ (డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌)లో ప్రవేశం కల్పించాలన్న తమ ఆదేశాల్ని డీఈఈ సెట్‌ కన్వీనర్‌ రమణకుమార్‌ అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఉత్తర్వుల్ని అమలు చేయకుండా కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు రూ.లక్ష జరిమానా ఎందుకు విధించ కూడదో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయ మూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మా సనం నిలదీసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఈలోగా తమ ప్రశ్నలకు జవాబులతో కౌంటర్‌  దాఖలు చేయాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. వృత్తివిద్య పూర్తి చేసిన వారు డిప్ల మో కోర్సులో చేరేందుకు అనర్హులనే నిబంధనను ఒక విద్యార్థి సవాల్‌ చేశారు. ఆ విద్యార్థికి వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా డీఈఈడీలో ప్రవేశం కల్పించాలని ఆగస్టు 17న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలు చేయకపోవడంతో విద్యార్థి కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కన్వీనర్‌ రమణ కుమార్‌ స్వయంగా కోర్టుకు హాజరై విద్యార్థికి ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. మరోసారి వ్యాజ్యం విచారణకు రావడంతో విద్యార్థి తరఫు న్యాయవాది రామన్‌ వాదిస్తూ.. కోర్టు ధిక్కార కేసు వేస్తేగానీ ప్రవేశం కల్పించలేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గట్టిగా తేల్చి చెబితేగానీ స్పందించరా.. రూ.లక్ష జరిమానా ఎందుకు విధించరాదో వచ్చే వారం జరిగే విచారణలోగా కౌంటర్‌ ద్వారా తెలియజేయాలని కన్వీనర్‌ను ఆదేశించింది.

మరిన్ని వార్తలు