జనరిక్.. మాయాజాలం

8 Jul, 2016 11:25 IST|Sakshi
 అధిక ధరలకు విక్రయం
 గుడ్‌విల్ మత్తులో వైద్యులు 
 ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు 
 ఏజెన్సీలకు కాసుల పంట 
 
బెల్లంపల్లి రూరల్ : ఆదిలాబాద్ జిల్లాలోని మందుల దుకాణదారులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుండడంతో సామాన్య ప్రజల ఆరోగ్యం అగమ్యగోచరంగా మారుతోంది. మెరుగైన వైద్యం కోసం పట్టణ ప్రాంతాలకు తరలివస్తే కొత్త సీసాలో పాత మందు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వైద్యులు వేలాది రూపాయలు పరీక్షల పేరిట తీసుకోవడమే కాకుండా రోగానికి పనికొచ్చే మందులు ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్, కాగజ్‌నగర్, శ్రీరాంపూర్‌తోపాటు పలు మండలాల్లో మందుల షాపుల యజమానులు జనరిక్ మందులను పేరు పొందిన కంపెనీల మందుల ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
 
జనరిక్ మందులు రోగులకు అంటగడితే 100 శాతం లాభాలను గడించవచ్చని తెలివిగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు ఏ మందులు రాసినా దుకాణాల యజమానులు రోగులకు ఎక్కువ మొత్తంలో సంబంధిత జనరిక్ మందులే ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పని చేసే వైద్యులు మెడికల్ ఏజెన్సీలతో కుమ్మక్కై బ్రాండెడ్ మందులకు బదులుగా జనరిక్ మందులను రోగులకు అంటగడుతూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. జనరిక్ మందులను రాస్తే వైద్యులకు ఏజెన్సీ వారు పెద్ద మొత్తంలో గుడ్‌విల్‌ను అందించడమే కాకుండా మందుల దుకాణాల యజమానులకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
 
అర్హత లేకున్నా దుకాణాల నిర్వహణ
పట్టణాల్లో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న మెడికల్ షాపుల నిర్వహణ మరీ అధ్వానంగా మారింది. కనీస అర్హత లేని వ్యక్తులు కూడా మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఫార్మసి లైసెన్స్ కలిగి ఉండి నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కొంత కాలం దుకాణాల్లో పని చేసిన వారూ.. అవగాహన లేని వారూ దుకాణాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మందుల దుకాణాల నిర్వహణ, ఆస్పత్రుల పని తీరుపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉండగా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. 
 
రోగం వచ్చినా.. నొప్పి వచ్చినా పట్టణాలకే
ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు పట్టణాలకే వైద్యం నిమిత్తం వస్తుంటారు. రోగుల అత్యవసర పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు ఇక్కడి వైద్యులతో పాటు మందుల దుకాణాల యజమానులు వ్యవహరిస్తున్నారు. రోగానికి తగ్గట్లు మందులు ఇవ్వాల్సి ఉండగా జనరిక్ మందులను రాస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్షర జ్ఞానం లేని పల్లెవాసులు వారిని నమ్మి అధిక ధరలకు మందులు కొనుగోలు చేస్తున్నారు. పల్లెల్లోని ఆర్‌ఎంపీలు సైతం జనరిక్ మందులను రోగులకు ఇస్తున్నారు. ఎలాంటి పరిజ్ఞానం లేకుండా మందుల షాపులను నిర్వహిస్తున్న యజమానులపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 
 
నిబంధనలు ఏమి లేవు 
జనరిక్ మందులు అమ్మకూడదని ఎలాంటి నిబంధనలు లేవు. లెసైన్స్ లేకుండా ఎవరైనా మందుల షాపులను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. 
 - రాజమొగిళి, మంచిర్యాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్
 
 
మరిన్ని వార్తలు