రైలుబండి.. సినిమాలండి!

28 Sep, 2018 01:00 IST|Sakshi

బోగీల్లో హాట్‌స్పాట్‌లు.. త్వరలో టెండర్లు

రైలు ప్రయాణంలో బోరు కొడుతోందా? మీ సీరియళ్లు, క్రికెట్‌ మ్యాచ్‌లు మిస్సవు తున్నామన్న బెంగా? సినిమాలు చూద్దామంటే నెట్‌ బ్యాలెన్స్‌ తక్కువుందా? లైట్‌ తీసుకోండి.. ఎందుకంటే.. రైల్వే శాఖ లేటెస్ట్‌గా తెస్తున్న ఓ కొత్త సదుపాయం ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపనుంది.    – సాక్షి, హైదరాబాద్‌

ఇంతకీ ఏమిటది?
మనకు తెలిసిందే.. వైఫై.. ఇళ్లలో ఉన్నట్టుగానే ఇప్పుడు వీటిని బోగీల్లోనూ పెట్టనున్నారు. ఇప్పటికే ఈ హాట్‌స్పాట్‌లను ఆపరేషన్‌ స్వర్ణ్‌ కింద శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే అధికారులు పరీక్షించి చూశారు కూడా. ప్రయోగం విజయవంతమవడంతో మరిన్ని రైళ్లకు విస్తరించనున్నారు.

తేజస్‌లో అనుకున్నా..
తొలుత దీన్ని తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌లో అమలు చేద్దామనుకున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ప్రతీసీటుకు ఓ ఎల్‌సీడీ స్క్రీన్‌ ఉంటుంది. అయితే, మొన్నామధ్య ఈ తేజస్‌ ముంబై– గోవా ట్రైన్‌లో సీట్లకు ఉన్న ఎల్‌సీడీ స్క్రీన్లను, హెడ్‌సెట్లను ప్రయాణికులు ఎత్తుకెళ్లడంతో రైల్వేశాఖ వెనకడుగు వేసింది.  

మరి ఏయే రైళ్లలో..
శతాబ్ది, ప్రీమియం, దురంతోలాంటి రైళ్లలో దీన్ని అందు బాటులోకి తేనున్నారు.  ఫోన్లు, ల్యాప్‌టాపుల్లో వైఫై కనెక్ట్‌ చేసుకుని.. కావాల్సిన సినిమా, సీరియళ్లు, మ్యాచ్‌లు చూసుకోవచ్చు. త్వరలో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తారా లేదా తెలియరాలేదు. దీనిపై త్వరలోనే రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని వార్తలు