కనిపించె నెలవంక.. రంజాన్‌ వేడుక

5 Jun, 2019 07:09 IST|Sakshi
చార్మినార్‌ మక్కా మసీదు

ముస్తాబైన చారిత్రక మసీదులు

సాక్షి,సిటీబ్యూరో: నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు మంగళవారం రాత్రి నెలవంక దర్శనంతో దీక్షలు విరమించారు. బుధవారం రంజాన్‌ పండగ జరుపుకునేందుకు సకల ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం నగరంలోని మసీదులు, ఈద్గాలను ముస్తాబు చేశారు. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు మసీదులు, ఈద్గాల్లో ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ నమాజ్‌ చేస్తారు. ఈద్‌ నమాజ్‌కు ఇస్లాంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రోజు దైవదూతలు ఉపవాస దీక్షలు పాటించిన వారికి స్వాగతం పలుకుతారని ముస్లింల విశ్వాసం. 

సిద్ధమైన మసీదులు  
ఇస్లాంలో మసీదులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలో పరిశుద్ధమైన ప్రదేశం మసీదు అని మహ్మద్‌ ప్రవక్త బోధించినట్టు రచనలు చెబుతున్నాయి. మసీదు నిర్వాహణతో దేవుడి కరుణ లభిస్తుందని, మసీదు సమానత్వనికి, న్యాయానికి ప్రతీక అని మత గురువులు చెబుతారు. ఇంతటి పవిత్రమై వందల మసీదులు, ఈద్గాలకు మహానగరం నిలయం. 

మసీ–ఎ–సుఫా
దక్కన్‌లోని అతిపురాతనమైన ‘మసీ–ఎ–సుఫా’ మసీదు బహమనీ సుల్తాన్‌ల పాలనా కాలంలోనే నగరంలో నిర్మించారు. అంటే గోల్కొండ కోట నిర్మిణానికి ముందే ఈ మసీదును నిర్మించారని చరిత్రకారుల కథనం. ఇందులో ప్రస్తుతం మూడు వందల మంది నమాజ్‌ చేసుకునేందుకు అనుకూలంగా ఉంది. 

జామా మసీదు
చార్మినార్‌ చెంతన ఉన్న మక్కా మసీదు గురించి అందరికీ తెలిసిందే. అయితే, దీని నిర్మాణానికి పూర్వమే 1597లో జామా మసీదును సుల్తాన్‌ కులీ కుతుబ్‌షా రాజ్యాధికారి మీర్‌జుమ్లా అమీనుల్‌ ముల్క్‌ అతీఫ్‌ ఖాన్‌ బహదూర్‌ నిర్మించారు. ఆ రోజుల్లో ఇదే అతి పెద్ద మసీదు. ఇందులో 1500 మంది నమాజ్‌ చేసుకునే సౌకార్యం ఉంది.

మక్కా మసీదు
మక్కా మసీదు మత సామరస్యానికి ప్రతీక. అద్భుతమైన ఇరానీ శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే ఈ మసీదు నిర్మాణానికి 1617లో సుల్తాన్‌ మహ్మద్‌ కుతుబ్‌ షా శంకుస్థాపన చేశారు. అయితే, ఆయన పాలనలో నిర్మాణం పూర్తి కాలేదు. తర్వాత అబ్దుల్లా కుతుబ్‌షా, తానీషా కాలంలో కూడా పూర్తి కాలేదు. చివరికి 1694లో ఔరంగజేబు పాలనలో మసీదు నిర్మాణం పూర్తయింది. మహ్మద్‌ ప్రవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్లు, మట్టి తీసుకొచ్చి ఇక్కడ మసీదు నిర్మాణంలో వాడినందుకు దీనికి ‘మక్కా మసీదు’గా పేరొచ్చింది. ఇందులో దాదాపు 10 వేల మంది నమాజ్‌ చేసుకోవచ్చు. 

ఖైరతాబాద్‌ జామియా మసీదు
జామియా మసీదును 1626లో సుల్తాన్‌ ∙కులీ కుతుబ్‌షా కుమారుడు సుల్తాన్‌ మహ్మద్‌ కుతుబ్‌æషా నిర్మించాడు. ఈ మసీదు ఖైరతాబాద్‌ చౌరస్తాకు అనుకొని ఉంది. కొత్త నగరంలోని అతిపెద్ద మసీదు ఇదే. ఇందులో 4 వేల మంది నమాజ్‌ చేసుకోవచ్చు. 

హయత్‌నగర్‌ మసీదు
హయత్‌నగర్‌ మసీదును 1626లో కులీ కుతుబ్‌æషా సోదరి హయత్‌ బక్షి బేగం నిర్మించారు. ఇందులో సుమారు 1200 మంది నమాజ్‌ చేసుకోవచ్చు. 

మజీదే కలాన్‌
గోల్కొండ కోట ఆవరణలో మజీదే కలాన్‌ పేరుతో 1666లో హయత్‌ బక్షి బేగం మరో మసీదును నిర్మించారు. ఇందులో ప్రస్తుతం 1500 మంది నమాజ్‌ చేకోవచ్చు.  
∙గోల్కొండ కోటలో 1668లో సుల్తాన్‌ అబ్దుల్లా ఈ మసీదును నిర్మించాడు. ఇందులో 1000 మంది నమాజ్‌ చేసుకోవచ్చు. 

టోలి మసీదు
దమ్మిడి మసీదుగా మరో పేరున్న ‘టోలి మసీదు’ను కార్వాన్‌లో 1671లో సుల్తాన్‌ అబ్దుల్లా కుతుబ్‌షాæ నిర్మించాడు. దాదాపు నాలుగున్నర శతాబ్దాలుగా ఈ మసీదులో ఎలాంటి మార్పులు లేకుండా అద్భుతంగా ఉంది. ఇందులో 5 వేల మంది వరకు నమాజ్‌ చదువుకోవచ్చు.

మసీదే మియా ముష్క్‌
పురానాపూల్‌ సమీపంలో ‘మసీదే మియా ముష్క్‌’ మసీదును 1674లో సుల్తాన్‌ అబ్దుల్లా కుతుబ్‌షాæ ధార్మిక పండితుడైన మియా ముష్క్‌ పేరు మీద నిర్మించారు. రెండు అంతస్తుల్లో ఉన్న మసీదు ఇదొక్కటే. అయితే, కాలానుగుణంగా రోడ్డు ఎత్తు పెరగడంతో ప్రస్తుతం పై అంతస్తులోనే నమాజ్‌ చేస్తున్నారు. ఇందులో 1500 మంది నమాజ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు