పర్యావరణ హితం మన మెట్రో

5 Jun, 2019 07:25 IST|Sakshi

6.8 కోట్ల మంది మెట్రో జర్నీ..

నగర పర్యావరణానికి మెట్రో రైళ్ల చేయూత..

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పర్యావరణ పరిరక్షణకు మెట్రో రైళ్లు ఇతోధికంగా సాయపడుతున్నాయని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 6.8 కోట్ల మంది మెట్రో జర్నీ చేశారన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్రో రైళ్లతో నగర పర్యావరణానికి కలిగిన ప్రయోజనాలను ఆయన తెలిపారు.

మెట్రోతో పర్యావరణ పరిరక్షణ ఇలా..
గత రెండేళ్లుగా మెట్రో రైళ్లలో 6.8 కోట్ల మంది ప్రయాణించారు.
మెట్రో కారణంగా 57 కోట్ల కిలోమీటర్ల మేర కార్లు,ద్విచక్రవాహనాలు తిరిగే అవసరం తప్పింది. అంటే అన్ని కిలోమీటర్ల మేర ఆదా జరిగినట్లే.
కార్లు, ద్విచక్రవాహనాల వినియోగం తగ్గడంతో 39000 టన్నుల కార్భన్‌డయాక్సైడ్‌ ఉద్గారాలను మెట్రో తగ్గించింది. ఆమేరకు ఉద్గారాలు పర్యావరణంలో కలవకుండా నిరోధించినట్లైంది.
1.7 కోట్ల లీటర్ల ఇంధనాన్ని మెట్రో రైళ్లతో ఆదా జరిగింది.
మెట్రో రైళ్ల గమనంలో వేసే బ్రేకులతో ఉత్పత్తయిన శక్తితో 2.2 కోట్ల కిలోవాట్‌హవర్స్‌ మేర ఇంధనాన్ని ఉత్పత్తి చేశారు.
మెట్రో మార్గాల్లో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా 2 కోట్ల లీటర్ల వర్షపునీటిని ఒడిసిపట్టారు.
12 మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్‌ వాహనాల ఛార్జింగ్‌ సదుపాయం కల్పించారు.

మరిన్ని వార్తలు