హైదరాబాద్ లో 'ఆపరేషన్ లేట్ నైట్ రోమియో'

11 Jun, 2015 16:16 IST|Sakshi

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాతబస్తీలోని హోటళ్ల యజమానులు అప్రమత్తంగా ఉండి, పోలీసులకు సహకరించాలని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో గురువారం ఆయన తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....పాతబస్తీలో యువకులు రాత్రి పూట రోడ్లపై తిరగడంతోపాటు హోటళ్లలో కూడా గంటల తరబడి కూర్చుని మీటింగ్‌లు పెడుతున్నారన్నారు. ఇలాంటి సందర్భంలోనే గత నెలలో స్ట్రీట్ ఫైట్ ఘటన జరిగి నబీల్ అనే యువకుడు మృతి చెందాడని గుర్తు చేశారు. దీంతో తాము 'ఆపరేషన్ లేట్ నైట్ రోమియో'కు శ్రీకారం చుట్టామన్నారు. రాత్రి పూట ఆవారాగా తిరుగుతూ హోటళ్లలో తిష్ట వేసే యువకులను వెంటనే పంపించేలా హోటల్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. హోటళ్లలో యువకుల నడుమ గొడవలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా హోటల్‌కు వచ్చే అసాంఘిక శక్తులు, అనుమానితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బాల కార్మికులతో పని చేయించుకోరాదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు