గ్రేటర్‌ రోడ్లు ప్రైవేటుకు!

11 Oct, 2019 05:10 IST|Sakshi

సాఫీ ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ

జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు రోడ్ల నిర్వహణH

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని పేరెన్నికగన్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చేపట్టనున్నాయి. భారీ ఫ్లైఓవర్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులతోసహా వివిధ ఇంజనీరింగ్‌ పనుల్లో పేరుగాంచిన సంస్థలు ఇకపై నగర రోడ్ల నిర్వహణ పనులు చేయనున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 9వేల కిలోమీటర్లకు పైగా రోడ్లుండగా, ప్రధాన మార్గాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్లు ఉన్నాయి. వీటి మరమ్మతులు, రీకార్పెటింగ్, తదితర పనుల కోసం జీహెచ్‌ఎంసీ ఏటా రూ. 500– 600 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ రోడ్లు ఎప్పుడూ గుంతల మయమే. అధ్వానపు రోడ్లతో ప్రజలకు అవస్థలేకాకుండా, సామాజిక మాధ్యమాల్లో నిత్యం ప్రభుత్వంపై విమర్శలు తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో రోడ్ల నిర్వహణను పూర్తిగా ప్రైవేట్‌ సంస్థలకివ్వాలని మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ నిర్ణయించారు. విధివిధానాలు రూపొందించేందుకు జీహెచ్‌ఎంసీలోని ముగ్గురు చీఫ్‌ ఇంజనీర్లతోపాటు, పబ్లిక్‌హెల్త్‌ మాజీ ఈఎన్‌సీని కమిటీ సభ్యులుగా నియమించారు. దీనికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ముందుగా పేరెన్నికగన్న పలు కంపెనీలతో కమిటీ సమావేశం నిర్వహించింది. వందలు, వేల కోట్ల భారీ ప్రాజెక్టులు చేసే పెద్ద కంపెనీలు రోడ్ల నిర్వహణకు ఒప్పుకుంటాయా అనే అనుమానాలున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రోడ్లను పరిశీలించేందుకు అంగీకరించాయి. ఆయా సంస్థలు రోడ్లను పరిశీలించాక, మరోమారు జరిగే సమావేశంలో టెండర్లలో పొందుపరిచే అంశాలు, నిబంధనలు, నిర్వహణ వ్యయం తదితర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. అది పూర్తయ్యాక టెండర్లను ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ప్రీబిడ్‌ సమావేశాలు పూర్తిచేసి టెండర్లలో అర్హత పొందే కంపెనీకి రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు.

సాఫీ ప్రయాణమే లక్ష్యం.. 
రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు సిమెంట్‌ కాంక్రీట్‌ వేస్తారా లేక బీటీనా అన్న విషయంతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటలపాటు రోడ్లు సవ్యంగా,  ప్రయాణానికి సాఫీగా ఉండేలా నిర్వహించడం నిర్వహణ చేపట్టే సంస్థ పని. వర్షాలు తదితర కారణాల వల్ల పెద్ద గుంతలు ఏర్పడ్డా, ఇతరత్రా దెబ్బతిన్నా, 24 నుంచి 48 గంటల్లో మరమ్మతులు పూర్తిచేయాలి. వివిధ సంస్థల అవసరాల కనుగుణంగా రోడ్‌ కటింగ్‌లకు అనుమతులిచ్చే అధికారం, ఆ తర్వాత త్వరితంగా తిరిగి పూడ్చటం వంటివాటిపై కాంట్రాక్టు సంస్థకే అధికారం ఉంటుంది.

తొలిదశలో 687 కి.మీ.లు
తొలిదశలో జోన్ల వారీగా ఎక్కువ వాహనరద్దీ ఉండే ప్రధాన మార్గాలను గుర్తించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 687.43 కి.మీ.ల రద్దీ రోడ్లు ఉన్నాయి. జోన్ల వారీగా రోడ్ల నిర్వహణ కోసం యాన్యువల్‌ మెయింటెనెన్స్‌ కాంట్రాక్ట్‌ (ఏఎంసీ) పేరిట వీటికి టెండర్లు ఆహ్వానించనున్నారు.

మరిన్ని వార్తలు