ఒప్పందాలు ముగిస్తే లాభమే

18 Dec, 2014 02:05 IST|Sakshi

* విద్యుత్‌రంగంపై తెలంగాణ ఇంధనశాఖ నివేదిక
* 2019తో ముగియనున్న పలు ఒప్పందాలు

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ముగిసిపోతే తెలంగాణ ఎక్కువగా లాభపడుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం టీఎస్ జెన్‌కో, ఏపీ జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ పంపిణీ అవుతోంది. చాలా విద్యుత్ కేంద్రాల్లో ఒప్పందాల గడువు అయిదేళ్లలో ముగిసిపోనుంది. అప్పుడు ఏపీ జెన్‌కో ప్లాంట్ల నుంచి విద్యుత్ వాటా నిలిచిపోతుంది. అదే సమయంలో టీఎస్ జెన్‌కో ప్రాజెక్టులలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ నూరు శాతం తెలంగాణ సొంతమవుతుంది.

దీంతో విద్యుత్ కొనుగోలు వ్యవహారాల్లో రాష్ట్రానికి దాదాపు రూ.275 కోట్లు ఆదా అవుతుందని ఇంధన శాఖ లెక్కలేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న విద్యుత్ లభ్యత వివరాలను.. 2019 మార్చి 31 నాటితో ముగిసే ఒప్పందాల అనంతరం ఉండే విద్యుత్ పరిస్థితిని ఇటీవలి టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఇంధనశాఖ ప్రత్యేకంగా పొందుపరిచింది. ప్రస్తుతం టీఎస్‌జెన్‌కో పరిధిలో థర్మల్, హైడల్ కేంద్రాల్లో మొత్తం 3,058 మెగావాట్ల విద్యుత్‌కు ఒప్పందాలు అమల్లో ఉన్నాయి. దీంతో తెలంగాణకు కేవలం 1,648 మెగావాట్ల కరెంటు అందుతోంది. ఒప్పందాల గడువు ముగిసిపోతే మొత్తం 3,058 మెగావాట్లు దక్కుతుంది.  పీపీఏల ప్రకారం ఇప్పుడు లభ్యమవుతున్న విద్యుత్‌తో పోలిస్తే 1,410 మెగావాట్లు అదనంగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది.

అదే సమయంలో ఒప్పందాలు ముగియటం వల్ల ఏపీ జెన్‌కో 1,757 మెగావాట్లు కోల్పోతుందని ఇంధన శాఖ లెక్కగట్టింది. దీనికి తోడు టీఎస్ జెన్‌కో పరిధిలోని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఖర్చుతో పోలిస్తే.. ఏపీ జెన్‌కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా నమోదవుతోంది. బొగ్గు గనులు అందుబాటులో లేకపోవటం, రవాణా భారం ఉత్పాదక వ్యయంలో యూనిట్‌కు 52 పైసల తేడా ఉంటుందని ఇంధన శాఖ గుర్తించింది. ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ప్లాంట్లలో రూ.2.84 చొప్పున ఖర్చు అవుతుండగా... అదే యూనిట్‌కు ఏపీ జెన్‌కో పరిధిలో రూ.3.36 ఖర్చు అవుతుందని పోల్చి చెప్పింది.

ఒప్పందాల గడువు ముగిసిపోతే తెలంగాణ ప్లాంట్ల నుంచి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్తును ఏపీ కోల్పోతుందని.. దీంతో అయిదు శాతం ఖర్చు అదనంగా భరించాల్సి వస్తుందని.. అదే సమయంలో తెలంగాణకు రూ.275 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేసింది. కొత్తగూడెం, రామగుండం(బి) థర్మల్ ప్లాంట్లు, నార్ల తాతారావు థర్మల్ ప్లాంట్, ఆర్‌టీపీపీ స్టేజీ వన్,  అప్పర్ సీలేరు, శ్రీశైలం కుడి కాల్వ, ఎడమ కాల్వ, నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్, కుడి కాల్వ, తమిళనాడులోని నైవేలి ప్లాంట్లతో ఇప్పుడున్న పంపిణీ ఒప్పందాలు 2019 మార్చి 31తో ముగియనున్నాయి.

మరిన్ని వార్తలు