మహిళలపై వేధింపులను ఉపేక్షించం

30 Sep, 2014 03:18 IST|Sakshi
మహిళలపై వేధింపులను ఉపేక్షించం

ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగం
దొంగనోట్ల చలామణి అరికడతాం
పోలీసులు సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దు
పెట్రోలింగ్ ముమ్మరం చేస్తాం
కొత్త ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
నిజామాబాద్ క్రైం : జిల్లాలో మహిళలపై వేధింపులు, నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీ సుకోనున్నట్లు జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెరిగిన టెక్నాలజీ వల్ల మహిళలు ఎక్కువగా వేధింపుల కు గురవుతున్నారని, వారి కి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మహిళలు స్వేచ్ఛగా పోలీసులను ఆశ్రయించవచ్చని అన్నారు. మహిళల ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ విభాగంలో అందరూ మహిళ అధికారులనే నియమిస్తామన్నారు. ఫిర్యాదులు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. చైన్ స్నాచింగ్‌లను నిరోధించేదుకు శ్రద్ధ పెడతామన్నారు. ఈ తరహా చోరీలపై మహిళలను చైతన్య పరుస్తామన్నారు. జిల్లాలో మహిళ పోలీస్‌స్టేషన్లు పెంచేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెట్రోలింగ్ ముమ్మరం చేసి జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షిస్తామన్నారు. పాత నేరస్తులపై నిఘా పెడతామన్నారు.

జిల్లాలో ఆటోడ్రైవర్ల ఆగడాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసిందని, అటువంటి వారి ఆటలు కట్టించేందుకు  చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో నకిలీ నోట్ల చెలమణి ఎక్కువ ఉందని తెలిసిందన్నారు. పోలీస్‌స్టేషన్లలో ఎస్సైలు సివిల్ తగాదాలు, సెటిల్‌మెంట్లు చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులతో పోలీసులు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామన్నారు. మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
 
జిల్లాపై అవగాహన ఉంది
మెదక్ జిల్లా రామచంద్రపురం డీఎస్పీగా, ఆదిలాబాద్ జిల్లా ఓఎస్‌డీగా విధులు నిర్వహించే సమయంలో తనకు జిల్లా గురించి కొంత అవగాహన ఏర్పడిందన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, తమ పరిధి అతిక్రమించకుండా విధులు నిర్వహిస్తానన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం తిర్మారాస్‌పల్లి గ్రామానికి చెందిన తాను పుట్టి పెరిగింది పల్లె ప్రాంతంలోనేన్నారు. 10వ తరగతి వరకు గ్రామంలోనే చదివాను, గ్రామీణ ప్రజల బాధలు తనకు తెలుసన్నారు. పేదలకు న్యాయం జరిగేలా కృషిచేస్తానన్నారు. అంతకుముందు ఎస్పీ తరుణ్‌జోషీ కొత్త ఎస్పీకి పూల బొకేతో స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని వార్తలు