పరిశ్రమలు మూత!

30 Jul, 2019 12:19 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా దివాళా తీస్తున్నాయి. వందల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు మూతపడుతున్నాయి.  పరిశ్రమల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఏళ్లుగా అందకపోవడంతో నిర్వహణ భారం తడిసిమోపడువుతోంది. మరోపక్క రుణం ఇచ్చిన బ్యాంకులకు క్రమం తప్పకుండా అప్పుతో కలిపి వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. దాదాపు ఆరేడు కేటగిరీల్లో సబ్సిడీ విడుదలకాకపోవడంతో పరిశ్రమల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.

ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొన్ని పరిశ్రమలు మూతపడగా.. మరికొన్ని అతికష్టం మీద నెట్టుకొస్తున్నాయి. నూతన పరిశ్రామిక పాలసీ వచ్చిన తొలి  రెండేళ్లలో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, రీయింబర్స్‌మెంట్‌ విడుదల తీరును చూసి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని పలువురు పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. 

ఆకర్షించిన ప్రోత్సాహకాలు.. 
రాష్ట్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానానికి (టీఎస్‌–ఐపాస్‌) ఆకర్షితులై చాలా మంది ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు జిల్లాలో అధిక సంఖ్యలో పరిశ్రమలు నెలకొల్పారు. 15 రోజుల్లోనే అనుమతులు ఇవ్వడంతోపాటు పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించడంతో స్థానిక, దేశీయ, బహుళ జాతీయ కంపెనీలు సైతం రాష్ట్రానికి వరుసకట్టాయి.

పరిశ్రమలు నెలకొల్పేందుకు టీ–ఐడియా కింద జనరల్, టీ–ప్రైడ్‌ కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీలు ఇస్తున్నారు. పెట్టుబడి, పావలా వడ్డీ సబ్సిడీ, స్టాంప్‌ డ్యూటీ, పన్నులు, భూమి ధర, భూ మార్పిడి, విద్యుత్‌ ఛార్జీల రీయింబర్స్‌మెంట్‌ తదితర ప్రోత్సాహకాలు ప్రకటించడంతో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా, భారీ, మెగా తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. టీఎస్‌–ఐపాస్‌ అమల్లోకి వచ్చాక జిల్లాలో రూ.41,580 కోట్ల అంచనా వ్యయంతో 855 పరిశ్రమల స్థాపనకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందాయి. ఇందులో ఇప్పటివరకు రూ.10,200 కోట్ల పెట్టుబడితో 511 పరిశ్రమలు తమ ఉత్పత్తులను మొదలు పెట్టాయి.   

రూ.230 కోట్ల మేర బకాయిలు.. 
జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ.230 కోట్ల సబ్సిడీ, రీయింబర్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ పారిశ్రామికవేత్తలకు అడపాదడపా సబ్సిడీ విడుదల చేస్తున్న ప్రభుత్వం.. జనరల్‌ కేటగిరీ విషయంలో కరుణించడం లేదు. ఈ కేటగిరీ పారిశ్రామికవేత్తలకు 2014, 2015 నుంచి సబ్సిడీలో ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. విద్యుత్‌ ఛార్జీల రీయింబర్స్‌మెంట్‌ చివరిసారిగా 2015 వరకు అందజేశారు.

2016 నుంచి ఇప్పటివరకు దిక్కులేదు. అలాగే 2014 నుంచి సేల్స్‌ ట్యాక్స్, పావలావడ్డీ సబ్సిడీ, పెట్టుబడి సబ్సిడీ, స్టాంప్‌ డ్యూటీ రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాకపోవడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీలకు చివరిసారిగా 2017 సెప్టెంబర్‌లో సబ్సిడీ అందజేసింది. ప్రతినెలా ఎదురుచూస్తున్న ఈ పారిశ్రామికవేత్తలు సబ్సిడీ విడుదలపై ఆశలు వదులుకుంటున్నారు.

ప్రభుత్వం మీద నమ్మకంతో సబ్సిడీ ద్వారా కొంత భారమైనా తగ్గుందని భావించి పరిశ్రమలు స్థాపిస్తే.. ఇప్పుడు కష్టాలు పడుతున్నామని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ నిర్వహణ భారం, బ్యాంకులకు అప్పుతో సహా వడ్డీ చెల్లింపులు తలకు మించిన భారంగా మారుతున్నాయంటున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. ఈ తరహా కొన్ని పరిశ్రమలు రాష్ట్రంలో ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో మూతపడ్డాయి. 

మూసివేతే శరణ్యం! 
‘పరిశ్రమల స్థాపనలో మొదటిస్థానంలో ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎంటర్‌ప్రైజెస్‌ స్థాపన విధానం సరళతరం చేశామని ప్రకటిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సబ్సిడీ విడుదలలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా మా లాంటి సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు మూతవేయడమే శరణ్యంగా మారుతోంది.

సబ్సిడీని నమ్ముకుని చేతిలో డబ్బులు లేకున్నా అప్పు తెచ్చి ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాం. ఐదేళ్లుగా సబ్సిడీగా విడుదల కాకుంటే ఎలా నడిపిస్తాం. తెచ్చిన అప్పుకు పెరుగుతున్న వడ్డీని తలుచుకుంటే ఏం పాలుపోవడం లేదు. సబ్సిడీ, రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేస్తేనే పరిశ్రమలకు మళ్లీ జీవం వస్తుంది. లేదంటే మూసివేతే శరణ్యం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పారిశ్రామికవేత్త ‘సాక్షి’తో తన ఆవేదనను పంచుకున్నారు. 

మరిన్ని వార్తలు