గురుకుల జేఎల్‌ పోస్టులకు 17 నుంచి ఇంటర్వ్యూలు

8 Jun, 2019 01:36 IST|Sakshi

ఇంటర్వ్యూ, డెమో పరిశీలనకు 4 బోర్డులు ఏర్పాటు 

కొత్త జాబితా రూపొందాక డిగ్రీ లెక్చరర్ల భర్తీకి చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల జూనియర్‌ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీపై రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) మరో అడుగు ముందుకేసింది. డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీ ముందుగా చేపట్టిన తర్వాత జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని గురుకుల బోర్డు భావించింది. కానీ డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తడంతో ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేసి జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీని ముందుకు తెచ్చింది. ఇప్పటికే జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు సంబంధించి 1:2 పద్ధతిలో ఎంపికైన∙ప్రాథమిక జాబితాలోని అభ్య ర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టిన బోర్డు.. తాజాగా ఈ నెల 17 నుంచి 22 వరకు ఇంటర్వ్యూలు, డెమో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో తేదీలు ఖరారు చేయనుంది. 

పరిశీలనకు ప్రత్యేక బోర్డులు.. 
జేఎల్‌ అభ్యర్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ, డెమోను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బోర్డులో గురుకుల నియామకాల బోర్డు, గురుకుల సొసైటీ, విషయ నిపుణులు, మానసిక వైద్యుడు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసిన ఆ మేరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తా రు. ఇంటర్వ్యూ కేటగిరీలో 25 మార్కులుంటాయి. ఇంటర్వ్యూ, డెమో ప్రక్రియకు గరిష్టంగా 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వ్యవధి ఉంటుంది. రాత పరీక్ష మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది జాబితాను ఎంపిక చేస్తారు. 

త్వరలో డీఎల్‌ ప్రాథమిక జాబితా 
గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా త్వరలో విడుదల కానుంది. వాస్తవానికి ఇప్పటికే 1:2 పద్ధతిలో ప్రాథమిక జాబితా ప్రకటించినా.. అందులో దాదాపు 30 శాతం అభ్యర్థులకు నిర్దేశిత తేదీ నాటికి అర్హతలు లేవు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఈ విషయం వెలుగు చూడటంతో అర్హతల్లేని అభ్యర్థులను జాబితా నుంచి తొలగించి కొత్త జాబితా రూపొందించేందుకు బోర్డు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా వారిని తొలగించి మెరిట్‌ ఆధారంగా కొత్త అభ్యర్థుల పేర్లను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రోస్టర్‌ ఆధారంగా 1:2 పద్ధతిలో పేర్లను ఖరారు చేయనుంది. ఇందుకు నెలరోజులు పట్టే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు