ఎన్నాళ్లో వేచిన సమయం!  

4 Aug, 2018 12:15 IST|Sakshi
నాసిరకం చెక్‌డ్యాంను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కళావతి (ఫైల్‌) 

8 నెలల తర్వాత నేడు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం

గత సమావేశంలో చర్చించిన సమస్యలు పరిష్కారం కాని వైనం

పడకేసిన పాలనా వ్యవహారాలు

మౌలిక వసతుల్లేక అవస్థలు పడుతున్న గిరిజనం

సీతంపేట శ్రీకాకుళం : సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలపై తరువాత కాలంలో అధికారులు ఎవరూ దృష్టిసారించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు చాలా సమస్యలతో ఇప్పటికీ సతమతమవుతున్నారు. 

నీటి కోసం అగచాట్లు

ఐటీడీఏ పరిధిలో తాగునీటి సౌకర్యం లేని గ్రామాలు వంద వరకూ ఉన్నాయి. రక్షిత పథకాల నిర్మాణానికి నిధులు మంజూరైనా పూర్తిస్థాయిలో పనులు జరగని పరిస్థితి. దీంతో నీటి కోసం గిరిపుత్రులు గెడ్డలపై ఆధార పడుతూ ఇబ్బందులు పడుతున్నారు.

అందని వైద్యం..

గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు కూడా సక్రమంగా అందడం లేదు. అత్యవసర సమయాల్లో కూడా 108 వాహన సేవలు మృగ్యమౌతున్నాయి. ఫీడర్‌ అంబులెన్స్‌లు ఉన్నా కొండపై గ్రామాలకు వెళ్లలేకపోతుండడంతో సకాలంలో గిరిజనులకు వైద్యసేవలు అందడం లేదు. 

మరెన్నో సమస్యలు...

రహదారులు లేని గ్రామాలు ఇప్పటికీ ఏజెన్సీలో చాలా ఉన్నాయి. గిరిజనలకు రహదారి, తాగునీటి సౌకర్యాల కల్పన పూర్తి స్థాయిలో కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అర్హులైన గిరిజనులకు సైతం గృహనిర్మాణ శాఖ ద్వారా నూతన ఇళ్లు మంజూరు లేదు. గతంలో నిర్మించిన ఇళ్లకు చాలా వరకు బిల్లులు ఇవ్వలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

నిధులు మంజూరైన నిర్మించలేకపోయారు!

గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ శాఖ ద్వారా ఐటీడీఏ టీపీఎంయూ విభాగం పరిధిలో ఏడు మండలాలకు 124 రహదారులు ఏడాది కిందట మంజూరయ్యాయి. అలాగే మరో 88 రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు మంజూయ్యాయి. అయితే ఇప్పటి వరకు పనులు మాత్రం పూర్తి చేయలేదు. జూలై నెలాఖరకు కొన్ని, ఆగస్టు 31వ తేదీ నాటికి మరి కొన్ని పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

లేదంటే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అయినా ఫలితం లేదు. కనీసం 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించినా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం. అలాగే చిన్ననీటి వనరుల ద్వారా  చెక్‌డ్యాం పనులు కూడా పూర్తికాలేదు. కొన్ని చోట్ల నిర్మాణాలు జరిగినా అవి నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి.

కొద్ది రోజుల కిందట టిటుకుపాయిగూడ, భామిని మండలం వడ్డంగి తదితర ప్రాంతాల్లో పాలకొండ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పర్యటించి చెక్‌డ్యాంలను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని విషయాన్ని గుర్తించారు. నాసిరకం పనులపై పూర్తిస్థాయిలో విజిలెన్స్‌ విచారణ చేయాలని ఆమె డిమాండ్‌ చేసినా ఫలితం లేదు. ఉపాధిహామీ పథకం పనులు చేసిన వారికి కూడా వేతనాలు చెల్లించలేదు. ఐటీడీఏ పరిధిలో ఉపాధి వేతన బకాయిలు సమారు రూ.10 కోట్లు ఉన్నాయి. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేతనదారులు కోరుతున్నారు.

గిట్టుబాటు ధరలు నిల్‌ 

గిరిజనులు పండిస్తోన్న అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. గిరిజన సహకార సంస్థ ఉన్నా.. అన్నిరకాల వస్తువులను కొనుగోలు చేయలేని పరిస్థితి. కొండచీపుర్లు, చింతపండు వంటి వస్తువులను మాత్రమే జీసీసీ కొనుగోలు చేస్తున్నా..వారికి కూడా సరైన మద్దతు ధరలు కల్పించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కందులు, పసుపు, అల్లం, జీడి వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నామని గిరిపుత్రులు చెబుతున్నారు.

 వెంటాడుతున్న ఏనుగుల సమస్య
ఏనుగుల సమస్య గిరిజనులను దశాబ్ద కా లంగా వెంటాడుతోంది. సుమారు 12 ఏనుగులు ఐటీడీఏ పరిధిలోని మండలాల్లోనే సంచరిస్తూ.. గిరిజనులకు చెందిన పంటలను, ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. చాలామందిని పొట్టనపెట్టుకున్నాయి. అయినా ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

బాధితులకు నష్ట పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితిలో శనివారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరగనుంది. అయితే గిరిజనుల సమస్యలపై సభ్యులు ఎలా స్పందిస్తారో.. ఏం మాట్లాడుతారో చూడాలి.

మరిన్ని వార్తలు