28న జగన్నాథ రథయాత్ర

24 Jun, 2014 03:53 IST|Sakshi
  •      యాత్రకు భారీ ఏర్పాట్లు
  •      విదేశీ బృందాల ప్రదర్శనలు
  •      లక్షమందికి ప్రసాదం వితరణ
  • సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ ఆలయం 24వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 28న జగన్నాథ రథయాత్రను నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ యాత్రకు నగరంతోపాటు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలిరానున్నారు. అత్యంత శోభాయమానంగా నిర్వహించే యాత్ర కోసం ఆలయ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

    ఆలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర ఎస్పీరోడ్, ఆర్పీరోడ్, మోండా మార్కెట్, క్లాక్‌టవర్, ఎస్డీరోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా సుమారు లక్షమంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 500 మంది వలంటీర్లను నియమించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
     
    ప్రదర్శన: శోభాయాత్రలో చైనా, రష్యా, ఆఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన ఇస్కాన్ భక్తులు హాజరై ఆధ్యాత్మిక,సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రపంచశాంతి, ఐక్యతకోసం ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. యాత్ర ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి భజనలతోపాటు, కృష్ణకథ, శృంగార దర్శనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం పదివేల మంది భక్తులచే జగన్నాథుడికి మహాహారతి ఇచ్చి కార్యక్రమాన్ని ముగించనున్నారు.
     

>
మరిన్ని వార్తలు