కొలువుల బండి

18 Sep, 2014 00:29 IST|Sakshi
కొలువుల బండి
  • నిరుద్యోగులకు, సంస్థలకు వారధిగా ‘ఈ-వ్యాన్’
  • బస్తీలలో దరఖాస్తుల స్వీకరణ
  • ఉద్యోగావకాశాలకు కొత్త మార్గం
  • జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహణ
  • సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఓ వైపు ఉద్యోగాల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. రెజ్యూమ్‌లు పట్టుకొని నిత్యం సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు తగిన అర్హతలు ఉన్న అభ్యర్థుల కోసం అనేక సంస్థలు వెదుకుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్‌ఎంసీ ఉభయులకూ అనుసంధానంగా ఉండేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా గత నెల 16న ‘ఈ-వ్యాన్’ అనే కొలువుల బండిని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించే పని ప్రారంభించింది.

    బస్తీలకు వెళ్లి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేసేలా ‘ఈ-వ్యాన్’ను రూపొందించారు. దీనిలో పేర్ల నమోదుకు నిరుద్యోగులు ఉత్సాహం చూపుతున్నారు. నెల రోజుల్లోనే వివిధ ప్రాంతాలకు చెందిన 1502 మంది ఉద్యోగాలు కావాలంటూ పేర్లు నమోదు చేసుకున్నారు. అభ్యర్థులుఈ-వ్యాన్‌కు సంబంధించిన కార్యాలయాలకు వెళ్లి కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. వీటిని ఈ-జోన్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మౌలాలి, మల్కాజిగిరి,
    మూసాపేటల్లో ఈ-జోన్ కార్యాలయాలు ఉన్నాయి.

    ఈ కేంద్రాల ద్వారా మరో 262 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంకో 12,539 మంది జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అదే సమయంలో వివిధ విభాగాల్లో పని చేసేందుకు తగిన అభ్యర్థులు కావాలంటూ 46 సంస్థలు జీహెచ్‌ఎంసీకి వివరాలు అందజేశాయి. ఆ సంస్థల్లో 1222 ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అర్హులైన వారిని పంపించింది. దీంతో ఇప్పటి వరకు 49 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో టెన్త్, ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీల వరకు చదివిన వారు ఉన్నారు. వీరికి నెలకు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం అందుతోంది.
     
    సమాచారం ఇవ్వాలి...

    ఈ-వ్యాన్ ఏ రోజు ఏ ప్రాంతానికి వస్తుందో సమచారం ఉండటం లేదని, ఆ వివరాలు ముందస్తుగా తెలియజేస్తే దరఖాస్తు చేసుకునేవారమని ఆయా బస్తీల్లోని నిరుద్యోగులు నిష్టూరమాడుతున్నారు. అధికారులు ఈమేరకు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తద్వారా మరింత మందికి ప్రయోజనం కలుగుతుందని వారంతా అభిప్రాయపడుతున్నారు.
     

మరిన్ని వార్తలు