హైకోర్టు జోక్యంతో కార్మికుడికి న్యాయం

17 Mar, 2018 02:55 IST|Sakshi

 నెలకు 12 వేల వేతనం చెల్లింపునకు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అంగీకారం

సాక్షి, హైదరాబాద్‌: ఓ కాంట్రాక్టర్‌ కింద విద్యుత్‌ శాఖలో పనిచేస్తూ ప్రమాదంలో చేయి కోల్పోయిన ఓ కార్మికునికి హైకోర్టు ఆదేశాలతో గౌరవప్రదమైన వేతనం దక్కింది. మొదట ఆ కార్మికునికి నెలకు రూ.5 వేలు చెల్లిస్తామని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) ప్రతి పాదించగా, దానికి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అతనికి కనీస వేతనం ఇచ్చే విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. దీంతో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అధికారులు ఆ కార్మికునికి నెలకు రూ.12 వేల వేతనాన్ని చెల్లిస్తామని కోర్టుకు నివేదించారు.

సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, అధికారులపై ఆ కార్మికుడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేసింది. శుక్రవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన పి.వెంకటేశ్వర్లు ఓ కాంట్రాక్టర్‌ కింద విద్యుత్‌ సంస్థలో కార్మికునిగా పనిచేస్తూ, విధి నిర్వహణలో 2011లో కుడిచేతిని పూర్తిగా కోల్పోయాడు.

తనకు ఉపాధి చూపాలని కోరి నా అధికారులు స్పందించకపోవడంతో 2013 లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. వెంకటేశ్వర్లు పిటిషన్‌ను కొట్టేశారు. వెంకటేశ్వర్లు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేయగా.. జస్టిస్‌ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం అతని పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు స్పష్టం చేసింది. అయితే అధికారులు స్పందించడం లేదని వెంకటేశ్వర్లు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశాడు.

మరిన్ని వార్తలు