కళ్లద్దాలు రాలే..

11 Oct, 2018 11:22 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం అభాసుపాలవుతోంది. పరీక్షలు చేసిన వైద్యాధికారులు అద్దాలు అందజేయడం లేదని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అద్దాల గురించి కంటి చూపు బాధితులు స్థానిక ఆశ కార్యకర్తలను అడిగితే ఎప్పుడొస్తాయో తమకు తెలియదంటుండగా, వైద్యాధికారులు ఆర్డర్‌ పెట్టామని, త్వరలో వస్తాయని దాటవేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా అద్దాలు అందజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో నిర్వహించిన కంటివెలుగు పరీక్షల్లో ప్రతీ వంద మందిలో 50 మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది.

50 రోజులైనా అందని అద్దాలు.. 
కంటి చూపులో దూరపు చూపు, దగ్గరి చూపు కనబడని వారు, అసలు కనబడని వారిని పరీక్షల్లో గుర్తిస్తున్నారు. దగ్గరి చూపు కనబడడం లేదని డాక్టర్లు నిర్ధారిస్తే వెంటనే వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు సమస్య ఉన్నవారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి అద్దాలకు ఆర్డర్‌ పెడుతున్నారు. రెండు కళ్లకు ఒకే రకమైన సైట్‌ ఉంటేనే కంటి అద్దాలు అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేయగా 30 రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయని సమాచారమిచ్చారు. కంటి పరీక్షలు ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టినా అద్దాలు ఇంత వరకూ రాలేదు. ఆర్డర్‌ పెట్టిన అద్దాలు వస్తాయా ? రావా ? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అద్దాలు ఎప్పుడు వస్తాయని కంటి వెలుగు శిబిరాల్లో అడిగినా ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు.
 
అందుబాటులో తొమ్మిది రకాల అద్దాలే..
కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వెంటనే అందించేందుకు ప్రభుత్వం తొమ్మిది రకాల కంటి అద్దాలనే అందుబాటులో ఉంచింది. 1.0 ఆర్‌ఎంబీఎఫ్‌ నుంచి 2.5ఆర్‌ఎంబీఎఫ్, 1.0 నుంచి 2.5 ఆర్‌ఎంబీ వరకు మాత్రమే కంటి అద్దాలు ఉన్నాయి.
 
23 వేల మందికి అందిన అద్దాలు.. 
కంటి వెలుగు కార్యక్రమానికి 1,07,160 మంది హాజరుకాగా 23,352 మందికి కంటి అద్దాలను అందించారు. 22,731 కంటి అద్దాల కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టారు. 11,123 మందికి కంటి శస్త్ర చికిత్స కోసం రెఫర్‌ చేశారు. అద్దాలు లేక తీవ్ర ఇబ్బందులు డాక్టర్లు నెల రోజులకు అద్దాలు వస్తాయని చెప్పినా ఇప్పటి వరకు అద్దాలు రాలేదు. ఎవరిని అడిగినా ఏమి చెప్పడం లేదు. దీంతో కళ్లు కనపడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. వెంటనే కళ్లద్దాలను అందించాలి. –గోరంట్ల లక్ష్మీ, నర్సక్కపల్లి గ్రామం, పరకాల మండలం

త్వరలో వస్తాయి..
ఆర్డర్‌ పెట్టిన కంటి అద్దాలు త్వరలో వస్తాయి. దూరపు, దగ్గర చూపు అద్దాలు స్టాక్‌ లేవు కాబట్టి ఆర్డర్‌ పెట్టాం. కొంత ఆలస్యమైనప్పటికీ అద్దాలన్నీ వస్తాయి. ఒకటి, రెండు పీహెచ్‌సీలకు ఈ రెండు రోజుల్లో వస్తాయి. వాటిని పంపిణీ చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్డర్‌ తీసుకున్న వారందరికీ అద్దాలు అందిస్తాం. –మధుసూదన్, డీఎంహెచ్‌ఓ  

మరిన్ని వార్తలు