కస్తూర్బా విద్యార్థుల ‘కన్నీటి’ బాధలు

11 Sep, 2014 01:00 IST|Sakshi
కస్తూర్బా విద్యార్థుల ‘కన్నీటి’ బాధలు

- ఊరుస్తున్న తరగతి గదులు
 -పనిచేయని సోలార్ లైట్లు
- ఆందోళనలో విద్యార్థినులు
- పట్టించుకోని అధికారులు
నార్నూర్ : బాలికలకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను ఏర్పాటు చేసింది. అందులో వారికి ఉచిత వసతి, భోజనం, యూనిఫామ్స్ తదితర సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంది. నార్నూర్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యార్థులకు నూతన భవనం నిర్మించారు. కానీ, సౌకర్యాలు కల్పించడంలో మాత్రం అధికారులు దృష్టి సారించడం లేదు. పాఠశాల ప్రారంభం నుంచి ఆశ్రమ బాలికల పాఠశాల పురాతన భవనంలో కొనసాగుతోంది. అక్కడ విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో నెల రోజుల క్రితం దాదాపు రూ.33 లక్షలతో నిర్మించిన నూతన భవనంలో పాఠశాలను మార్చారు.

మొత్తం 200 మంది విద్యార్థినులు ఉన్న ఈ పాఠశాలల్లో భవనంలో విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు లేక, చిన్న పాటి వర్షం పడిన తరగతి గదులల్లో కురుస్తుండడంతో రాత్రంతా జాగారం చేయాల్సి వస్తోందని పాఠశాల విద్యార్థినులు వాపోతున్నారు.
 
నూతన భవనంలో తీరని కష్టాలు
అసంపూర్తిగా నిర్మించిన కొత్త భవనంలో పాత భవనంలో కంటే ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి. ప్రహరీ నిర్మాణం చేపట్టక పోవడంతో తడకలు కట్టి ఉంచారు. గేటు లేదు. పట్టణానికి దూరంగా నిర్మించిన ఈ భవనానికి ప్రహరీ లేకపోవడం వల్ల రాత్రివేళల్లో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణంలో వేసిన చేతిపంపుకు చిలుము రావడంతో ఆ నీరు తాగిన విద్యార్థులు రోగాల భారీన పడుతున్నారు.

సరిపడా స్నానపు గదులు, మరుగుదొడ్లు లేకపోవడంతో భవనంపై కెక్కి స్నానం చేయాల్సి వస్తుంది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సోలార్‌లైట్లు పని చేయకపోవడంతో రాత్రంతా చీకట్లోనే ఉంటున్నారు. మరుగుదొడ్ల కోసం నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. అధికారులు స్పందించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు