మానవత్వం చాటిన మాజీ ఎంపీ కవిత

25 May, 2020 03:49 IST|Sakshi
పెద్ద కర్మకు హాజరైన గల్ఫ్‌ బాధితుడు (కుర్చీలో)

అయినవాళ్లను కోల్పోయిన గల్ఫ్‌ బాధితుడికి బాసట

లక్సేట్టిపేట(మంచిర్యాల): రోడ్డు ప్రమాదంలో తన వాళ్లను కోల్పోయి, గల్ఫ్‌ నుంచి రాలేక వారి అంత్యక్రియలను వీడియో కాల్‌ ద్వారా చూసి కుమిలిపోయిన ఓ వ్యక్తి కన్నీటి కథపై మాజీ ఎంపీ కవిత స్పందించారు. ఆ బాధితుడిని ప్రత్యేక వాహనం ద్వారా స్వగ్రామానికి పంపించి మానవత్వం చాటారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణానికి చెందిన పోతరాజుల శ్రీనివాస్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. ఈనెల 15న మందమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని భార్య సుజాత, కూతురు కావ్య దుర్మరణం చెందారు. దుబాయ్‌లో లాక్‌డౌన్‌ కారణంగా విమానాల రద్దుతో స్వగ్రామానికి రాలేక వీడియో కాల్‌ ద్వారానే వారి అంత్యక్రియలను చూశాడు. ఆదివారం వారి పెద్ద కర్మ ఉండటంతో రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చిన శ్రీనివాస్‌ను అధికారులు పెయిడ్‌ క్వారంటైన్‌లో ఉంచారు. పెద్ద కర్మకు వెళ్లేందుకు అధికారులు అనుమతించకపోవడంతో దుబాయ్‌లోని తన మిత్రుల సాయం కోరాడు. వారు ఈ విషయాన్ని మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె.. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకుని తన కార్యాలయ సిబ్బంది ద్వారా ప్రత్యేక వాహనంతో శ్రీనివాస్‌ను స్వగ్రామానికి పంపించారు.

మరిన్ని వార్తలు