పోలీసుల త్యాగం గొప్పది

5 Apr, 2015 01:28 IST|Sakshi
పోలీసుల త్యాగం గొప్పది

కాల్పులు, ఎన్‌కౌంటర్  ఘటనలపై కేసీఆర్ స్పందన
 అమరవీరులుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు    
 మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ
 గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం
 
 సాక్షి, హైదరాబాద్: దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పోలీసు కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజు, హోంగార్డు మహేష్‌లది గొప్ప త్యాగమని సీఎం  కేసీఆర్ కొనియాడారు. వీరు అమరవీరులుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సూర్యాపేటలో కాల్పులు, అనంతరం చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసులు స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించారని సీఎం అభినందించారు. ఈ రెండు ఘటనల్లో గాయపడిన సీఐలు మొగిలయ్య, బాల గంగిరెడ్డి, ఆత్మకూరు(ఎం) ఎస్‌ఐ సిద్ధయ్య, హోంగార్డు కిశోర్ అత్యంత సాహసోపేతంగా దుండగులతో పోరాడారని ప్రశంసించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన కాల్పులతో పాటు మోత్కూరు మండలం జానకీపురం వద్ద శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనల్లో మృతిచెందిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం చేయిస్తామన్నారు.

 

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చు అయినా సరే వెనకాడకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పోలీసులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


 

మరిన్ని వార్తలు